గోరఖ్‌పూర్, మార్చి 13: డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో ఓ వ్యక్తి కన్న తండ్రి తల నరికి, శరీరాన్ని ముక్కలుగా చేసిన దారుణ ఘటన యూపీలోని గోరఖ్‌పూర్‌లో శనివారం చోటు చేసుకొంది. పోలీసుల కథనం ప్రకారం డబ్బు విషయమై నిందితుడు ప్రిన్స్ గుప్తాకు, అతడి తండ్రి మాథుర్ గుప్తాకు గొడవ జరిగింది. తండ్రి డబ్బులివ్వనని చెప్పడంతో ఆగ్రహావేశానికి లోనైన ప్రిన్స్ గుప్తా మొదట కత్తితో తండ్రిని హత్య చేయాలని ప్రయత్నించి విఫలమయ్యాడు. ఆ తర్వాత పదునైన ఆయుధంతో తండ్రి గొంతు చీల్చి, తల నరికి, శరీరాన్ని ముక్కలుగా చేసి సూట్ కేసులో సర్ది స్కూటర్ మీద వాటిని తీసుకెళ్లి పడేశాడు. నిందితుడు స్కూటర్ మీద వెళ్లడం గమనించిన మృతుడి సోదరుడు ఇంట్లో రక్తపు మరకలు ఉండటం, ట్రాలీ సూట్ కేసు మాయం కావడం గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.