న్యూఢిల్లీ: గూగుల్ మ్యాప్స్‌లో టోల్ గేట్ రేట్లు కూడా ఇకపై కనిపించనున్నాయి. దీంతో ఒక ప్రయాణంలో టోల్ గేట్ ఖర్చులు ఎంత అవుతాయన్నదానిపై ఒక స్పష్టత రానున్నది. గూగుల్ మ్యాప్స్‌లో టోల్ గేట్ రేట్లకు సంబంధించిన కొత్త ఫీచర్‌ను తర్వలో అందుబాటులోకి తెస్తున్నట్లు గూగుల్ సంస్థ బుధవారం తెలిపింది. సాధారణ రోడ్లతోపాటు, టోల్ గేట్లు ఉండే రోడ్లను కూడా గూగుల్ మ్యాప్స్‌లో చూడవచ్చని పేర్కొంది. దీంతో ఏ మార్గంలో ప్రయాణించవచ్చో అన్నది ఎంచుకునేందుకు ఇది సహాయపడుతుందని తెలిపింది.
భారత్‌తోసహా అమెరికా, జపాన్, ఇండోనేషియాలోని సుమారు 2000 టోల్ రూట్లను గూగుల్ మ్యాప్స్‌లో పొందుపర్చనున్నట్లు గూగుల్ తెలిపింది. అండ్రాయిడ్, ఐఓఎస్‌లో ఈ అప్డేట్ను ఈ నెలలోనే అందుబాటులోకి తెస్తున్నట్లు పేర్కొంది. టోల్ పాస్, ఇతర చెల్లింపు విధానాలు, రోజు, సమయం వంటి ఆధారంగా ఒక గమ్యస్థానానికి ఎంత టోల్ ఖర్చు అవుతుందో అన్నది కూడా వినియోగదారులు ముందుగా తెలుసుకునేందుకు ఈ ఫీచర్ సహకరిస్తుందని వెల్లడించింది.
అలాగే అవకాశమున్న చోట్ల టోల్ గేట్ రూట్లతోపాటు ప్రత్యామ్నాయ రూట్ల గురించి తెలుసుకునేందుకు టోల్ ఫ్రీ రూట్ల ఆప్షన్ కూడా గూగుల్ మ్యాప్స్‌లో కొనసాగుతుందని ఆ సంస్థ తెలిపింది. గూగుల్ మ్యాప్స్‌లోని దిశల పైన కుడివైపు మూలలో ఉన్న మూడు చుక్కలపై ప్రెస్ చేస్తే రూట్ల ఆప్షన్లను ఎంచుకోవచ్చని, ‘అవాయిడ్ టోల్స్’ ఆప్షన్ ద్వారా టోల్ మార్గాలను పూర్తిగా నివారించుకోవచ్చని సూచించింది.
యాపిల్ వాచ్, లేదా ఐఫోన్లో గూగుల్ మ్యాప్స్‌ను సులభంగా ఉపయోగించడానికి ఐవోఎస్ వినియోగదారుల కోసం అదనంగా కొత్త అప్డేట్ను కూడా గూగుల్ విడుదల చేసింది. దీంతో యాపిల్ వాచ్‌లో నేరుగా గూగుల్ మ్యాప్స్ డైరెక్షన్లు త్వరలో పొందవచ్చు. ఐవోఎస్ స్పాట్లైట్, సిరి, షార్ట్కట్ల యాప్‌లతో కూడా గూగుల్ మ్యాప్స్ నేరుగా అనుసంధానమవుతుంది.