న్యూఢిల్లీ : ‘డబ్బులేమైనా చెట్లకు కాస్తున్నాయా?’ అనే మాటలు మనం తరచూ వింటూనే ఉంటాం. డబ్బులేమో కానీ, బంగారం మాత్రం చెట్లకు కాస్తుందని ఫిన్లాండ్ శాస్త్రవేత్తలు గుర్తించారు. బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్న ప్రస్తుత తరుణంలో వీరి పరిశోధనకు ప్రాధాన్యం సంతరించుకుంది. చెట్టు ఆకుల నుంచి బంగారం తీయొచ్చని వీరు గుర్తించారు. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఫిన్లాండ్, ఔలు విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు చెట్లలో ఈ సహజ ప్రక్రియను కనుగొన్నారు.
నార్వే స్ప్రూస్ చెట్ల ఆకులు సూదుల మాదిరిగా ఉంటాయి. వీటిలో అత్యంత సూక్ష్మమైన బంగారం కణాలు ఉండటాన్ని గమనించారు. చెట్లలో ఉండే సూక్ష్మజీవుల చర్యల ద్వారా ఈ బంగారం ఉత్పత్తి అవుతున్నదని, ఈ ప్రక్రియ జరగడానికి యంత్రాలు లేదా రసాయనాలు అవసరం లేదని శాస్త్రవేత్తలు చెప్పారు. నార్వే స్ప్రూస్ చెట్లలో విభిన్న రకాల సూక్ష్మజీవులు ఉంటాయి. ఇవి రసాయనిక ప్రతిచర్యలను ప్రేరేపిస్తాయి. పీ3ఓబీ-42, క్యుటిబ్యాక్టీరియమ్, కొరినెబ్యాక్టీరియం వంటి బ్యాక్టీరియా ఈ చెట్లలో పుష్కలంగా ఉన్నట్లు డీఎన్ఏ సీక్వెన్సింగ్‌లో తెలిసింది. సూదిగా ఉండే ఆకులు చిన్న ప్రయోగశాలగా పని చేస్తాయి. మట్టి నుంచి ద్రవ రూపంలోని బంగారం చెట్ల వేళ్ల ద్వారా ప్రయాణించి, ఆకుల సూదుల్లోకి చేరుతుంది. సూక్ష్మజీవులు ఈ ఆకుల సూదుల్లో బయోఫిలిం వంటి పొరను సృష్టిస్తాయి. ఈ ద్రవ రూపంలోని బంగారం ఈ ఆకుల సూదుల్లోకి చేరి, ఘన రూపంలో అత్యంత సూక్ష్మ కణాలుగా మారుతుంది.
నీటి ప్రవాహ మార్గాలు, సూక్ష్మజీవులు, స్థానిక పరిస్థితులు అనుకూలంగా ఉన్న ప్రాంతంలోని స్ప్రూస్ చెట్లకు మాత్రమే బంగారం పండుతుంది. ఇది పూర్తిగా పర్యావరణ హితకరమైన పద్ధతి. ప్రస్తుతం తవ్వకాలు, భూరసాయనిక అధ్యయనాల ద్వారా బంగారం నిక్షేపాలను గుర్తిస్తున్నారు. దీనివల్ల పర్యావరణానికి నష్టం జరుగుతున్నది. బంగారం ఉత్పత్తికి ఏ సూక్ష్మజీవులు ఉపయోగపడతాయో శాస్త్రవేత్తలు గుర్తించగలిగితే, చెట్లు సహజ బయలాజికల్ ఇండికేటర్స్‌గా ఉపయోగపడతాయి. ఫలితంగా బంగారం కోసం అన్వేషణ డ్రిల్లింగ్ నుంచి సూక్ష్మజీవులు, చెట్ల బయోమ్యాపింగ్కు మారుతుంది. తద్వారా ఈ ప్రక్రియ పర్యావరణ హితకరమైనది అవుతుంది. ఈ అధ్యయనం ప్రస్తుతం ప్రారంభ దశలో ఉంది. ఈ ప్రక్రియ ఇతర చెట్లకు, లోహాలకు కూడా వర్తిస్తుందా? అనే అంశం భవిష్యత్తులో జరిగే పరిశోధనల్లో తెలుస్తుంది.