న్యూఢిల్లీ/హైదరాబాద్, జూలై 23: బంగారం కొండ దిగింది. గత కొన్ని రోజులుగా పెరుగుతూ వచ్చిన ధరలు ఒక్కసారిగా దిగువముఖం పట్టాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన సార్వత్రిక బడ్జెట్లో పుత్తడి, వెండిపై కస్టమ్స్ డ్యూటీని తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయమే ఇందుకు కారణమని ట్రేడర్లు వెల్లడించారు. వీటిపై కస్టమ్స్ డ్యూటీని 15 శాతం నుంచి 6 శాతానికి తగ్గించడంతో వీటి ధరలు రూ.3 వేలకు పైగా దిగాయి. ఢిల్లీ బులియన్ మార్కెట్లో తులం పుత్తడి ధర రూ.3,350 దిగొచ్చి రూ.72, 300కి చేరుకున్నాయి.
బంగారంతోపాటు కిలో వెండి కూడా రూ.3,500 తగ్గి రూ. 87,500 వద్ద ముగిసింది. అంతకుముందు ఇది రూ.91 వేలుగా ఉన్నట్లు ఆల్ ఇండియా సరాఫ్ అసోసియేషన్ వెల్లడించింది. ఇటు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ పదిగ్రాముల బంగారం ధర ఏకంగా రూ.2,990 తగ్గి రూ.70,860కి దిగొచ్చింది. అలాగే 22 క్యారెట్ గోల్డ్ ధర రూ.2,750 తగ్గి రూ.64,950గా నమోదైంది. దీంతోపాటు వెండి ధరలు రూ.3,500 తగ్గి రూ.88 వేలకు చేరింది. అంతకుముందు ఇది రూ.91,500 గా ఉన్నది.
అటు ఫ్యూచర్ మార్కెట్లోనూ అతి విలువైన లోహాల ధరలు ఐదు శాతానికి పైగా తగ్గుముఖం పట్టాయి. తులం పుత్తడి ధర ఏకంగా రూ.3,860 తగ్గి రూ.68,900 దిగొచ్చింది. అలాగే ఐదు శాతం తగ్గిన కిలో వెండి ఏకంగా రూ.4,000 దిగొచ్చి రూ.85,185గా నమోదైంది. గతంలో బంగారం దిగుమతులను నియంత్రించాలనే ఉద్దేశంతో కస్టమ్స్ డ్యూటీని వరుసగా పెంచుతూ వచ్చిన సర్కార్ ఈసారి మాత్రం తగ్గించడం విశేషం. దీర్ఘకాలికంగా డిమాండ్ చేస్తున్న ఆభరణాల వర్తకులకు కేంద్ర సర్కార్ శుభవార్తను అందించింది.
దేశీయంగా భారీగా ధరలు తగ్గిన అతివిలువైన లోహాల ధరలు అంతర్జాతీయంగా మా త్రం పెరిగాయి. న్యూయార్క్ బులియన్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 17.10 డాలర్లు పెరిగి 2,459.20 డాలర్లకు చేరుకున్నది. కానీ, వెండి ధరలు యథాతథంగా 29.31 డాలర్ల వద్ద ఉన్నాయి. డాలర్ బలహీనపడటం, అమెరికా ఆర్థిక గణాంకాలు త్వరలో విడుదలకానుండటం, ఫెడ్ వడ్డీరేట్ల తగ్గింపుపై త్వరలో నిర్ణయం తీసుకోనుండటమే బంగా రం పెరగడానికి ప్రధాన కారణం.
అతి విలువైన లోహాలపై కస్టమ్ డ్యూటీని తగ్గించడంతో బంగారం అక్రమ రవాణాకు చెక్ పడే అవకాశాలున్నాయని జీటీఆర్ఐ వెల్లడించింది. అయినప్పటికీ కేంద్ర ఖజానాకు భారీ గండి పడే అవకాశాలున్నాయని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.28 వేల కోట్ల ఆదాయం కోల్పోవచ్చునని తెలిపింది. గతేడాది భారత్ 45.54 బిలియన్ డాలర్ల విలువైన బంగారాన్ని, 5.44 బిలియన్ డాలర్ల విలువైన వెండిని దిగుమతి చేసుకున్నది.
