పనాజీ, సెప్టెంబర్ 12: దేశానికి తెలంగాణ మార్గదర్శకంగా నిలుస్తున్నది..! ఈ మాట ఏ టీఆర్ఎస్ నాయకుడో, తెలంగాణవాదో అంటున్నది కాదు. పొద్దస్తమానం తెలంగాణ సర్కారుపై విషం చిమ్మే బీజేపీయే ఒప్పుకొంటున్నది. ఐటీ రంగానికి అడ్డాగా తెలంగాణను మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన టీ హబ్, మహిళా సాధికారతే లక్ష్యంగా ఏర్పాటుచేసిన వీ హబ్ తమకూ కావాలని బీజేపీ సర్కారే అడుగుతున్నది. బీజేపీ పాలిత గోవాలో ఐటీ రంగాన్ని బలోపేతం చేసేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణతో ఒప్పందం కుదుర్చుకొన్నది. సోమవారం ఆ రాష్ట్ర సీఎం ప్రమోద్ సావంత్ అధ్యక్షతన జరిగిన ఐటీ అడ్వైజరీ కౌన్సిల్ సమావేశానంతరం ఆ రాష్ట్ర ఐటీ మంత్రి రోహన్ ఖౌంతే మీడియాతో మాట్లాడారు. ‘టీ హబ్, వీ హబ్, టాస్క్ వంటివి గోవాలోనూ ఏర్పాటు చేసేందుకు తెలంగాణతో ఒప్పందం కుదుర్చుకొన్నాం. డిసెంబర్లోగా ఇక్కడి ఐటీ రంగంలో చైతన్యం తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం’ అని పేర్కొన్నారు. ఒప్పందంపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. నిజంగా దేశానికి తెలంగాణే ఆదర్శం అనటానికి ఇది సరైన ఉదాహరణ.. ఇదే కదా! తెలంగాణ విజన్.. అని ట్వీట్లు చేస్తున్నారు.