Zika Virus | మన దేశంలో తొలుత కేరళలో వెలుగు చూసిన జికా వైరస్ ఇప్పుడు కర్ణాటక రాష్ట్రానికి విస్తరించింది. రాయచూర్ ప్రాంతానికి చెందిన ఐదేళ్ల బాలికకు జికా వైరస్ సోకినట్లు అక్కడి అధికారులు గుర్తించారు. పరీక్షల్లో జికా వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కె. సుధాకర్ ప్రకటించారు.
‘పూణె ల్యాబ్‌కు ముగ్గురి రక్త నమూనాలు పంపాం. రెండు నెగెటివ్ రాగా, మరొకటి పాజిటివ్‌గా వచ్చింది. ఐదేళ్ల చిన్నారికి జికా వైరస్ ఉన్నట్టు తేలింది. ఈనెల 5న శాంపుల్స్ పంపగా.. 8వ తేదీన రిపోర్ట్ వచ్చింది. కొన్ని నెలల క్రితం జికా వైరస్ కేరళ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లో బయటపడింది. కర్ణాటకలో ఇదే తొలి కేసు. పరిస్థితిని ప్రభుత్వం చాలా జాగ్రత్తగా పర్యవేక్షిస్తోంది. ముందుగా మేము డెంగ్యు, చికున్ గున్యా అనుకున్నాం. సాధారణంగా ఇలాంటి 10 శాతం నమూనాలను పూణె ల్యాబ్ కు పంపిస్తుంటాం. దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం అన్ని ముందస్తు నివారణ చర్యలు తీసుకుంతోంది’ అని మంత్రి వివరించారు.