లక్నో: ప్రభుత్వ పాఠశాల ప్యూన్ ఒక విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. (Girl raped by school peon) ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని ఆమెను బెదిరించాడు. 13 ఏళ్ల ఆ బాలిక గర్భం దాల్చడంతో ఈ విషయం బయటపడింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ఫరూఖాబాద్‌లో ఈ సంఘటన జరిగింది. కొన్ని నెలల కిందట 13 ఏళ్ల బాలిక రాత్రి వేళ మూత్ర విసర్జన కోసం బయటకు వెళ్లింది. గ్రామంలోని పాఠశాలలో ప్యూన్‌గా పని చేస్తున్న పంకజ్, అతడి అనుచరుడు అమిత్ ఆ బాలికను పట్టుకున్నారు. ఖాళీ ఇంట్లోకి ఆమెను తీసుకెళ్లారు. ఆ బాలికపై వారిద్దరూ అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపుతామని బాలికను వారు బెదిరించారు.
కాగా, ఆగస్ట్ 31న ఆ బాలిక ఐదు నెలల గర్భవతిగా ఆమె తల్లి గుర్తించింది. దీంతో జరిగిన విషయాన్ని ఆ బాలిక చెప్పింది. ఈ నేపథ్యంలో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోక్సో చట్టంతోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంటి పెద్ద మరణించడంతో ప్రభుత్వ స్కూల్లో ప్యూన్‌గా పంకజ్‌కు ఉద్యోగం వచ్చిందని పోలీసులు తెలిపారు.