
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత గులాంనబీ ఆజాద్‌కు కేంద్రం పద్మవిభూషణ్ ప్రకటించడంపై ఇప్పుడు ఆ కురువృద్ధ పార్టీలో రెండు రకాల స్పందనలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్‌లో మార్పులు తేవాలని, నాయకత్వం మరింత క్రియాశీలంగా ఉండాలని వాదిస్తున్న గ్రూప్ ఆఫ్ 23 (జీ-23) సభ్యులు ఆ గ్రూప్ నాయకుడైన ఆజాద్‌ను సహజంగానే వెనకేసుకువస్తున్నారు. దేశంలో రెండో అత్యున్నత అవార్డు పొందినందుకు గ్రూపు సభ్యులైన కపిల్ సిబల్, శశిథరూర్ అభినందనలు తెలిపారు. దేశం గౌరవిస్తున్న మనిషిని పార్టీ నాయకత్వం ఉపయోగించుకోకపోవడం విచారకరమని సిబల్ అన్నారు. కాగా ఆ గ్రూపులో సభ్యుడు కాని జైరాం రమేశ్ మాత్రం ట్విట్టర్ వేదికగా ఆజాద్‌పై చురకలు వేశారు. బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ పద్మవిభూషణ్ అవార్డును తిరస్కరించడం ఉదాహరణగా చూపిస్తూ ఆయన ‘గులాం కాదు ఆజాద్’ అంటూ రమేశ్ చేసిన వ్యాఖ్యలు సంచలనం కలిగిస్తున్నాయి. కాగా అవార్డు ప్రకటించిన వెంటనే ఆజాద్ తన ట్విట్టర్ ప్రొఫైల్‌ను పాలక పక్షానికి అనుగుణంగా మార్చివేశారనే ప్రచారం గుప్పుమన్నది.