న్యూఢిల్లీ: ఒడిశా(Odisha) రాజధాని భువనేశ్వర్‌లో ఆగస్టు 15వ తేదీన ఓ ఆర్మీ ఆఫీసర్ గర్ల్‌ఫ్రెండ్‌తో స్థానిక పోలీసులు అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ అంశంలో మాజీ ఆర్మీ చీఫ్ వీకే సింగ్, సీబీఐ మాజీ డైరెక్టర్ ఎం నాగేశ్వర్ రావు మధ్య వాగ్వాదం జరుగుతోంది. ఆర్మీ ఆఫీసర్ ప్రియురాలి పట్ల ఒడిశా పోలీసుల ప్రవర్తన సరిగా లేదని జనరల్ వీకే సింగ్ తన సోషల్ మీడియా పోస్టులో ఆరోపించారు. పోలీసు ఆఫీసర్ల పట్ల తక్షణమే చర్యలు తీసుకోవాలని, అక్కడ జరిగిన ఘటన సిగ్గు చేటు అని ఆయన పేర్కొన్నారు. మాజీ ఆర్మీ ఆఫీసర్ కూతురు ఏమంటుందో వినాలని, భరత్‌పుర్ పోలీస్ స్టేషన్లో జరిగిన ఘటన సిగ్గు చేటు అని, పోలీసు దుస్తుల్లో ఉన్న క్రిమినల్స్‌పై ఒడిశా సీఎం చర్యలు తీసుకోవాలని వీకే సింగ్ తన పోస్టులో కోరారు.
Everyone Must listen to Ankita Pradhan, Fiancée of Army officer, Daughter of Rtd Army Officer- What happened to her in PS Bharatpur in #Odisha is shameful and horrendous. @CMO_Odisha should take immediate action against the police personnel and all who are trying to shield the…
— Gen VK Singh (@Gen_VKSingh) September 20, 2024
భరత్‌పుర్ పోలీసు స్టేషన్లో తనను కొట్టారని, లైంగికంగా వేధించారని బాధితురాలు తెలిపారు. తన ప్రియుడితో కలిసి ఫిర్యాదు ఇచ్చేందుకు పోలీసు స్టేషన్ వెళ్తే ఈ ఘటన జరిగినట్లు తెలిసింది. ఆర్మీ ఆఫీసర్‌ను అక్రమంగా పోలీసులు అరెస్టు చేసినట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి. మాజీ ఆర్మీ చీఫ్ చేసిన ఆరోపణలకు సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వర రావు కౌంటర్ ఇచ్చారు. ఆర్మీ ఆఫీసర్‌తో పాటు అతని ప్రియురాలు తాగిన మైకంలో చెడుగా ప్రవర్తించినట్లు పేర్కొన్నారు. ఫుల్‌గా తాగిన ఆ జంట రాత్రి పూట సిటీలో డ్రైవ్ చేశారని, ఓ దగ్గర ఇంజినీరింగ్ విద్యార్థులతో గొడవ పడ్డారని, భరత్‌పుర్ పోలీసు స్టేషన్లో హంగామా చేశారని, మెడికల్ టెస్టు చేయించుకోవాలని అడిగినప్పుడు నిరాకరించారని నాగేశ్వర రావు తెలిపారు.
ఒడిశా పోలీసుల్ని నాగేశ్వరరావు సమర్థించారు. రాష్ట్రంలో 600 పోలీసు స్టేషన్లు ఉన్నాయని,వాటిల్లో విజిటర్స్‌తో ఎవరూ దురుసగా ప్రవర్తించరని ఆయన తెలిపారు. వీకే సింగ్ తన అభిప్రాయాన్ని మార్చుకోవాలని ఆయన కోరారు.