న్యూఢిల్లీ : ప్రపంచ ఆర్థిక వేదిక రూపొందించిన ప్రపంచ లింగ అసమానత నివేదిక-2025లో భారత్ నిరుడుతో పోలిస్తే రెండు స్థానాలు కిందకు దిగజారి 131వ స్థానంలో నిలిచింది. 64.1 శాతం స్కోర్‌తో దక్షిణాసియాలో అతి తక్కువ ర్యాంక్ పొందిన దేశంగా అపకీర్తిని మూటగట్టుకుంది. గురువారం విడుదలైన ఈ నివేదిక ప్రకారం.. ఆర్థిక భాగస్వామ్యం, అవకాశాలు, విద్యార్జన, ఆరోగ్యం-మనుగడ, రాజకీయ సాధికారత వంటి కీలకాంశాల ప్రాతిపదికన ఈ నివేదికను రూపొందించారు.
ఆర్థిక భాగస్వామ్యం, విద్యార్జన అంశాల్లో భారత్ కొంత మెరుగైన ఫలితాలను(40.7 శాతం) సాధించింది. శ్రామిక శక్తి భాగస్వామ్యం నిరుడు ఎంతో ఉందో(45.9 శాతం) ఈ సంవత్సరం అంతే ఉంది. విద్యార్జనను పరిశీలిస్తే మహిళల అక్షరాస్యత, విద్యా సంస్థల్లో వారి ప్రవేశాల స్థాయిలో మెరుగుదల కనిపించింది. లింగ నిష్పత్తి, ఆరోగ్యం-మనుగడ అంశాల్లో భారత్ ప్రగతి సాధించినప్పటికీ స్త్రీ-పురుషుల ఆయుర్దాయం తగ్గింది. రాజకీయ సాధికారతలోనూ భారత్ పాయింట్లు కాస్త (-0.6) తగ్గాయి.