GBS | ముంబై, జనవరి 27 (నమస్తే తెలంగాణ): మహారాష్ట్రలో కొత్త వ్యాధి ఒకటి ప్రజలను భయపెడుతున్నది. గుల్లెయిన్ బారే సిండ్రోమ్ (జీబీఎస్) కేసులు వేగంగా పెరుగుతున్నాయి. పుణెలో తొలి మరణం నమోదైంది. ప్రస్తుతం రాష్ట్రంలో జీబీఎస్ కేసుల సంఖ్య 101కు పెరిగింది. 28 మందికి ఇన్ఫెక్షన్ ధ్రువీకరించారు. పూణెలో 24 గంటల్లో కొత్తగా 28 కేసులు నమోదయ్యాయి.16 మంది వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. రోగుల నుంచి సేకరించిన కొన్ని శాంపిల్స్ ల్యాబ్‌కు పంపించగా, అందులో క్యాంపిలో బాక్టర్ జెజుని బ్యాక్టీరియా ఉన్నట్లు వెల్లడైంది. అది అత్యంత తీవ్రమైన అంటు వ్యాధి కావడంతో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. పూణెలో ప్రధాన నీటి వనరైన ఖడక్ వాసలా డ్యామ్ సమీపంలోని ఓ బావిలో ఈ-కోలి అనే బ్యాక్టీరియా ఎకువగా ఉన్నట్లు శనివారం విడుదలైన ల్యాబ్ టెస్ట్ ఫలితాలు వెల్లడించాయి.
అయితే ఆ బావిని అసలు వినియోగిస్తున్నారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఈ నేపథ్యంలో పూణెకు తాగునీటిని అందిస్తున్న ప్రధాన జలాశయంలోని నీటిని పరీక్షలకు పంపించారు.దీంతో పూణె ప్రజలు బాగా మరిగించి చల్లార్చిన నీటినే తాగాలని వైద్య ఆరోగ్య శాఖ సూచిస్తోంది. ఈ వ్యాధిగ్రస్థులకు ప్రభుత్వ దవాఖానలలో ఉచితంగా చికిత్స చేయిస్తామని మహారాష్ట్ర ఆర్థిక మంత్రి అజిత్ పవార్ ప్రకటించారు. జీబీఎస్ కేసుల కట్టడి కోసం మహారాష్ట్రకు సహకరించేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ ఏడుగురు సభ్యులతో కూడిన ఉన్నత స్థాయి నిపుణుల బృందాన్ని పంపించింది.
అత్యంత అరుదైన వ్యాధి
జీబీఎస్ అత్యంత అరుదైన వ్యాధి. జీబీఎస్ ప్రపంచంలో మూడోవంతు మరణాలకు కారణమవుతుందని వైద్యులు తెలిపారు. ఇది సంక్రమించినవారి రోగ నిరోధక వ్యవస్థ దెబ్బ తింటుంది. బ్యాక్టీరియల్ లేదా వైరల్ ఇన్ఫెక్షన్స్ సోకినవారికి ఇది త్వరగా వస్తుంది. ఈ వ్యాధి వల్ల నీరసం, పక్షవాతం వంటి తీవ్రమైన సమస్యలు తలెత్తుతాయి. మెదడు సంకేతాలను శరీరంలోని వివిధ విభాగాలకు తీసుకెళ్లే నరాలపై దాడి చేస్తుంది. బలహీనపరుస్తుంది. దీనికి చికిత్సలో సుమారు రూ.20 వేల విలువైన ఇంజెక్షన్లను వాడాల్సి ఉంటుంది. బాధిత రోగులలో 80 శాతం మంది డిశ్చార్జి అయిన 6 నెలలోపు కోలుకుని నడవగల సామర్థ్యం పొందుతారని వైద్యులు వెల్లడించారు.