GATE Result 2023 | గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూట్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (GATE) పరీక్ష ఫలితాలు వెలువడ్డాయి. గురువారం సాయంత్రం ఐఐటీ కాన్పూర్ ఫలితాలను విడుదల చేసింది. అయితే, ఒకేసారి విద్యార్థులు ఫలితాలను తెలుసుకునేందుకు వెబ్సైట్లోకి లాగిన్ కాగా.. సాంకేతిక కారణాలతో సర్వర్ మొరాయిస్తున్నది. అభ్యర్థులు gate.iitk.ac.in వెబ్సైట్లో ఫలితాలను తెలుసుకోవచ్చని అధికారులు సూచించారు. తాజాగా ఫలితాలను ప్రకటించిన అధికారులు.. స్కోర్ కార్డులు మాత్రం ఈ నెల 21 నుంచి అందుబాటులోకి వస్తాయని తెలిపారు.
దేశంలోని ఐఐటీలు, ఎన్ఐటీలు, ప్రఖ్యాత ఇంజినీరింగ్ విద్యా సంస్థల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ గత నెలలో పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. గేట్ పరీక్షలో సాధించిన స్కోరుతో దేశంలోని ఉన్నత విద్యాసంస్థల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశంతోపాటు నెలనెలా ఉపకారవేతనం పొందేందుకు అవకాశం ఉంటుంది. అదే సమయంలో స్కోర్ సహాయంతో పీహెచ్డీ ప్రవేశాలకు సైతం ఉపయోగపడుతుంది. కొన్ని పబ్లిక్, ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగ నియామకాలకు ఈ స్కోరు ప్రామాణికంగా తీసుకుంటారు.