పాల్గర్: మొబైల్ ఫోన్ టవర్లకు చెందిన సర్వర్ రూముల నుంచి బ్యాటరీలు ఎత్తుకెళ్తున్న దొంగల(Battery Thieves) ముఠాను మహారాష్ట్ర పోలీసులు పట్టుకున్నారు. ఆ ముఠాలోని 9 మంది సభ్యుల్ని అరెస్టు చేశారు. పాల్గర్ జిల్లాలో వాళ్లను అదుపులోకి తీసుకున్నారు. డిసెంబర్ 5వ తేదీన బాలివాలి గ్రామంలో ఉన్న మొబైల్ టవర్ సర్వర్ రూమ్ నుంచి సుమారు 12వేలు ఖరీదైన 24 బ్యాటరీలను ఎత్తుకెళ్లారు. టవర్ క్యాబిన్ తాళం పగులగొట్టి, బ్యాటరీలను చోరీ చేస్తున్నారని పోలీసు ఇన్స్పెక్టర్ ప్రమోద్ బదాక్ తెలిపారు. మాండ్వి పోలీసులు 303(2) చోరీ కేసు బుక్ చేసి దర్యాప్తు చేపడుతున్నారు.
మొబైల్ టవర్ల నుంచి బ్యాటరీలు ఎత్తుకెళ్తున్న ఘటనలు ఇటీవల పాల్గర్ సమీపంలో ఎక్కువయ్యాయి. దీంతో పోలీసులు దొంగల కోసం గాలింపును ముమ్మరం చేశారు. సీసీటీవీ ఫూటేజ్, టెక్నికల్, నిఘా ఇంటెలిజెన్స్ ద్వారా దొంగలను పట్టుకునే ప్రయత్నం చేశారు. దీనిలో భాగంగానే 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. దీంట్లో ఇద్దరు స్క్రాప్ డీలర్లు కూడా ఉన్నారు. నిందితుల్ని విచారిస్తున్న సమయంలో.. అనేక విషయాలు వెలుగు చూశాయి. వాసాయి, విరార్, వాడా, బోయిసర్ ప్రాంతాల్లో జరిగిన బ్యాటరీ చోరీలు తామే చేసినట్లు పేర్కొన్నారు. మాండ్వి, విరార్, పెల్హార్, నయిగావ్, బోయిసర్ లో ఆరు కేసులు బుక్కయ్యాయి.