లక్నో: గ్యాంగ్ లీడర్ బర్త్ డేను అతడి గ్యాంగ్ సభ్యులు వినూత్నంగా జరిపారు. బిజీ మార్కెట్లో బాంబులు విసిరారు. (Throw Bombs To Celebrate Birthday) కాల్పులు జరిపి భయాందోళన సృష్టించారు. దర్యాప్తు జరిపిన పోలీసులు ఆ గ్యాంగ్ సభ్యులను అరెస్ట్ చేశారు. ఆ మార్కెట్ ప్రాంతంలో వారిని ఊరేగించారు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఈ సంఘటన జరిగింది. ఒక గ్యాంగ్‌కు చెందిన ముగ్గురు వ్యక్తులు తమ లీడర్ పుట్టిన రోజును వినూత్నంగా జరుపుకున్నారు. జనవరి 15న కాన్పూర్‌లోని లాల్ బంగ్లా ప్రాంతంలో ఉన్న రద్దీ మార్కెట్ వద్ద అలజడి సృష్టించారు. అక్కడ బాంబులు విసరడంతోపాటు కాల్పులు జరిపారు. దీంతో వ్యాపారులు భయాందోళన చెందారు.
కాగా, ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఈ సంఘటనపై దర్యాప్తు జరిపారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. అక్కడ బాంబులు విసిరి కాల్పులు జరిపిన నిందితులను గుర్తించారు. గ్యాంగ్ సభ్యులైన 18 ఏళ్ల సాహిల్, 27 ఏళ్ల దేబు కుమార్ వాల్మీకి, 23 ఏళ్ల రజ్జుల్లాను అరెస్ట్ చేశారు. వారిని ఆ మార్కెట్ వద్దకు పోలీసులు తీసుకెళ్లారు. అక్కడి వ్యాపారులు చూస్తుండగా నిందితులను ఊరేగించారు.
మరోవైపు సమాజంలో శాంతికి ఎలాంటి భంగం కలుగకుండా చూస్తామని పోలీస్ అధికారి తెలిపారు. మార్కెట్లోని వ్యాపారుల్లో ధైర్యం నింపేందుకే నిందితులను అక్కడ ఊరేగించినట్లు చెప్పారు. అరెస్టైన నిందితుల సహచరులపై నిఘా ఉంచామన్నారు. వారిపై కూడా తగిన చర్యలు చేపడతామని వెల్లడించారు.