న్యూఢిల్లీ, డిసెంబర్ 24: ఢిల్లీలో కాలుష్య స్థాయి ఆందోళనకరంగా ఉందని కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అంగీకరించారు. దేశ రాజధానిలో రెండురోజులుంటే తనకు ఇన్ఫెక్షన్ సోకడం ఖాయమని ఆయన వ్యాఖ్యానించారు. వాయు నాణ్యత దిగజారడానికి వాహనాల నుంచి వెలువడే కాలుష్యం కూడా ప్రధాన కారణమని మంగళవారం ఢిల్లీలో ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ప్రసంగిస్తూ గడ్కరీ వ్యాఖ్యానించారు. నిజమైన జాతీయవాదం ఏదైనా నేడు ఉంటే అది దిగుమతులు తగ్గించి, ఎగుమతులు పెంచడంలో ఉంటుందని ఆయన చెప్పారు. రెండు రోజులు ఢిల్లీలో ఉంటే తనకు ఇన్ఫెక్షన్ సోకుతుందని వ్యాఖ్యానిస్తూ ఢిల్లీని ఎందుకు కాలుష్యం పట్టిపీడిస్తోందని ఆయన ప్రశ్నించారు. తాను రవాణా మంత్రినని, తన శాఖ వల్లే 40 శాతం కాలుష్యం ఏర్పడుతోందని ఆయన తెలిపారు. ఏటా రూ. 22 లక్షల కోట్లు ఖర్చుపెట్టి శిలాజ ఇంధనాలను దిగుమతి చేసుకుంటున్నాము. ఇదే రకమైన జాతీయవాదం? అంత భారీ స్థాయిలో డబ్బు ఖర్చు పెట్టి మన దేశాన్ని మనమే కలుషితం చేస్తున్నాము. ప్రత్యామ్నాయ ఇంధనాలు, జీవ ఇంధనాలలో మనం స్వయం సమృద్ధిని సాధించలేమా అని గడ్కరీ ప్రశ్నించారు.