IAS Officer Sanjita Mohapatra | ప్రతి తల్లీ తండ్రీ తమ ఇంటి పేరు నిలబెట్టే వారసుడు కావాలని కోరుకుంటారు. ఆడపిల్లలు పుడితే మహాలక్ష్మి పుట్టిందనుకున్నా.. తర్వాతైనా తమ ఇంటి పేరు నిలిపే వారసుడు కావాలని కలలు కంటారు. అటువంటి కథే తాజాగా బయటకు వచ్చింది. ఒడిశాలోని రూర్కేలా జిల్లాకు చెందిన ఓ పేద కుటుంబం నుంచి వచ్చిన సంజితా మొహాపాత్రాది ఇదే స్టోరీ. ఆమె తల్లిదండ్రులకు తొలుత బాలిక జన్మించింది. తర్వాతైనా బాలుడు కావాలనుకున్నారు. తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచినట్లు మళ్లీ బాలికే పుట్టింది. దీంతో సంజితా తల్లి ఆ బాలికే వద్దనుకుంది. కానీ పెద్ద కూతురు పట్టుదలతో చిన్న బిడ్డనూ పెంచుకున్నా ఇబ్బందులు తప్పలేదు. పలు ఇబ్బందుల మధ్య పెరిగిన సంజితా ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ అయ్యారు.
పేదరికంలో మగ్గిన ఈ కుటుంబంలో చదువు కోవాలన్నా, ఎదగాలన్నా సంజితా పలు ఇబ్బందులు ఎదుర్కొంది. కానీ సామాజిక సంస్థలు, ఉపాధ్యాయులు, స్కాలర్‌షిప్‌ల సాయంతో విద్యాభ్యాసం పూర్తి చేసింది. తొలుత వద్దనుకున్నా తమ కెరీర్ పట్ల తమ తల్లిదండ్రులు చాలా కష్ట పడ్డారని సంజితా తెలిపారు. మెకానికల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ పట్టా అందుకున్న సంజితా తొలుత స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ మేనేజర్‌గా పని చేశారు. అప్పుడే సొంతూళ్లో తమ తల్లిదండ్రులు ఇల్లు కట్టుకోవడానికి సాయం చేశారు.
చిన్నప్పుడే ఐఏఎస్ అధికారి కావాలన్న కల పెంచుకున్న సంజిత తన భర్త మద్దతు, స్ఫూర్తితో 2019లో ఐదో దఫా విజయం సాధించారు. తాజాగా మహారాష్ట్రలోని అమరావతి జిల్లా పరిషత్ సీఈఓగా పని చేస్తున్నారు. మహిళా స్వయం సహాయ బృందాలకు సాధికారత, జిల్లా పరిషత్ స్కూళ్లలో నాణ్యతతో కూడిన విద్యాభ్యాసం మెరుగుదలకు చర్యలు తీసుకుంటున్నారు. ఆమె సోదరి ప్రస్తుతం బెంగళూరులోని భారత్ హెవీ ఎలక్ట్రికల్స్‌లో మేనేజర్‌గా పని చేస్తున్నారు.