పుణె: అవినీతి, అక్రమాలకు పాల్పడేవాడు కోట్లకు పడగెత్తుతాడని.. నీతి, నిజాయితీలతో బతికేవాడు కూటికి తిప్పలు పడుతాడని ఈ మధ్య ఓ నానుడి బాగా వాడుకలోకి వచ్చింది. అయితే, ఈ నానుడి అక్షర సత్యమని తాజా సంఘటన రుజువు చేసింది. ఎందుకంటే మూడేండ్ల కిందటి ఓ అవినీతి కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి ఇంట్లో పోలీసులకు భారీగా బంగారం, వెండి లభ్యమయ్యాయి. వెండి గిన్నెలు, పూజ సామాగ్రి దొరికాయి. పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలో 2018లో నిర్వహించిన టీచర్ ఎలిజిబిలిటీ పరీక్షల్లో అక్రమాలు వెలుగుచూశాయి. ఇద్దరు వ్యక్తులు కాసుల కోసం కక్కుర్తిపడి కొందరు అభ్యర్థులకు అక్రమంగా ఎక్కువ మార్కులు వేసినట్లు బయటపడింది. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన పుణె సైబర్ క్రైమ్ పోలీసులు.. మహారాష్ట్ర స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ మాజీ కమిషనర్ సుఖ్‌దేవ్ ధీరే (61), జీఏ సాఫ్ట్వేర్ కంపెనీ మాజీ ప్రాజెక్టు మేనేజర్ అశ్వినీ కుమార్ (41)లను ప్రధాన నిందితులుగా గుర్తించారు.
గత మంగళవారం మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లాలో సుఖ్‌దేవ్ ధీరేను, బెంగళూరులోని కళ్యాణ్‌నగర్ నుంచి అశ్వినీకుమార్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో ఆదివారం పుణె సైబర్ క్రైమ్ పోలీసులు అశ్వినీ కుమార్ ఇంట్లో సోదాలు నిర్వహించగా కళ్లు బైర్లు కమ్మే అన్ని ఆభరణాలు బయటపడ్డాయి. వాటిలో బంగారం, వెండి ఆభరణాలు, వజ్రాలు పొదిగిన బంగారు నగలు, వెండి పల్లాలు, పాత్రలు, వెండి పూజసామాగ్రి లభ్యమయ్యాయి. వాటన్నింటిని పోలీసులు సీజ్ చేశారు.
సీజ్ చేసిన ఆభరణాల్లో రూ.85.20 లక్షల విలువచేసే 1.48 కిలోల వెండి, 44.74 క్యారట్ డైమండ్, రూ.16.75 లక్షల విలువచేసే 27 కిలోల వెండి సామాగ్రి ఉన్నాయి. వాటి మొత్తం విలువ సుమారుగా 1.02 కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు.