సెలెబ్రెటీల జీవన శైలిపై అందరికీ ఆసక్తి వుంటుంది. ఇక.. సినిమా రంగంలో వున్న సెలెబ్రెటీల విషయం చెప్పనక్కర్లేదు. వారి జీవితంలోని ప్రతి విషయాన్నీ తెలుసుకోవాలన్న కుతూహలం సహజంగానే వుంటుంది. వారి వ్యక్తిగత జీవితాలు, వారి అలవాట్లు, ఇష్టమైన రుచులు, జీవన విధానం… ఇలా… ప్రతి ఒక్క విషయాన్నీ తెలుసుకోవాలన్న జిజ్ఞాస సహజంగానే వుంటుంది. తన గాత్రంతో ప్రజల్ని మంత్రముగ్ధుల్ని చేసిన గాన కోకిల లతా మంగేష్కర్ శరీరం విడిచిపెట్టారు. దేశభక్తి గీతం, ప్రణయ గీతం, భావోద్వేగం… ఏ పాట తీసుకోండి… ఆ పాటను అనుభవిస్తూ పాడటం లతా ప్రత్యేకత. ఇంత సెలెబ్రెటీ అయినా… సామాన్యులకు ఉన్నట్లుగానే ఆమెకూ కొన్ని ఇష్టాయిష్టాలున్నాయి. అవేంటో చూడండి..
అన్ని రుతువుల కంటే లతాకు శరదృతువు అంటే మహా ప్రీతి. బ్రహ్మ ముహూర్తం అంటే లతాకు తెగ ఇష్టమట. ఈ సమయంలోనే ఆమె సంగీత ఆరాధన బాగా చేసేవారని ప్రతీతి. ఇక అన్ని పండుగల్లో కెల్లా దీపావళి అంటే బాగా ఇష్టపడతారట. ఇక రంగుల్లో తెలుపు వర్ణాన్ని బాగా ఇష్టపడతారు. అందుకే దాదాపు ప్రతిసారీ తెలుపు వర్ణం చీరలోనే ఆమె ఎక్కువగా కనిపించేవారు. అయితే సాదాసీదాగా జీవించడాన్నే ఆమె ఎక్కువగా ఇష్టపడేవారు. ఇక నగలంటే ఆమెకు మహా ప్రీతి అని సన్నిహితులు చెబుతున్నారు. వజ్రాలతో ఉన్న గాజులంటే బాగా ఇష్టమని, వాటిపై ఆమెకు మక్కువ ఎక్కువ. ఇక నగరాలను తీసుకుంటే స్వస్థలమైన ముంబైనే ఎంచుకుంటారట. విదేశాల్లో మాత్రం న్యూయార్క్ పట్టణమంటే లతాకు బాగా ఇష్టం. ఇక ఇష్టమైన గ్రంథాల్లో జ్ఞానేశ్వరీ భగవద్గీత, స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస, యోగి అరవిందుల సాహిత్యాన్ని బాగా అధ్యయనం చేసేవారు. ఇష్టమైన సాధువుల్లో మీరాబాయి మొదటి శ్రేణిలో వుంటారు. క్రీడల్లో క్రికెట్, ఫుట్బాల్, టెన్నీస్ ఆటలంటే ఇష్టం. ఇక ఫొటోగ్రఫీ, వంటలు చేయడాన్ని కూడా ఆస్వాదిస్తారు.