Ration |న్యూఢిల్లీ: ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన(పీఎంజీకేఏవై) కింద అనర్హులైన లబ్ధిదారులను ఏరివేసేందుకు ఆహార మంత్రిత్వశాఖకు ఆదాయ పన్ను(ఐటీ) శాఖ వివరాలను అందజేయనున్నది. ఆదాయ పన్ను చెల్లించని పేద కుటుంబాలకు పీఎంజీకేఏవై కింద ఉచిత రేషన్‌ను ప్రభుత్వం అందజేస్తున్నది.
2026 ఆర్థిక సంవత్సరంలో పీఎంజీకేఏవై కోసం రూ. 2.03 లక్షల కోట్లను కేంద్రం బడ్జెట్లో కేటాయించింది. ఆహార, ప్రజా పంపిణీ శాఖ(డీఎఫ్పీడీ) సంయుక్త కార్యదర్శికి ఆదాయ పన్ను (సిస్టమ్స్) శాఖ డైరెక్టర్ జనరల్ (డీజీఐటీ) సమాచారం అందచేస్తారని సీబీడీటీ తెలిపింది. లబ్ధిదారుల ఆధార్ నంబర్ లేదా పాన్‌తోపాటు మదింపు సంవత్సరాల వివరాలను సమర్పిస్తే, నిర్ణీత మొత్తం కంటే అధిక ఆదాయం కలిగిన వారి డాటాను డీజీఐటీ సిస్టమ్స్ అందజేస్తుంది. అనర్హుల వివరాలను గుర్తించడంలో ఈ డాటా కీలకం కానుంది.