అంబాలా: హర్యానా(Haryana)లోని అంబాలా జిల్లాలో విషాదం చోటుచేసుకున్నది. బోరుబావిలో పడిన నాలుగేళ్ల బాలుడు మృతిచెందాడు. సుమారు 21 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ జరిగింది. ఆ చిన్నారిని బయటకు తీసినా.. ఆ బాలుడు మృతిచెందినట్లు గుర్తించారు. సుమారు 220 అడుగుల లోతులో ఆ పిల్లోడు బోరుబావిలో చిక్కుకున్నాడు. బుధవారం తెల్లవారుజామున 3.40 నిమిషాలకు నిర్వాయిర్ సింగ్‌ను బోర్వెల్ నుంచి బయటకు తీశారు. మంగళవారం ఉదయం నుంచి రెస్క్యూ ఆపరేషన్ జరిగింది. అంబాలా కంటోన్మెంట్లో ఉన్న సివిల్ ఆస్పత్రికి ఆ చిన్నారిని అంబులెన్స్‌లో తీసుకెళ్లారు. కానీ ఆ బాలుడు ప్రాణాలు కోల్పోయినట్లు తేల్చారు. బోరుబావిని ఓపెన్‌గా పెట్టిన బాధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. రెస్క్యూ ఆపరేషన్‌లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ హర్యానా, పోలీసు, ఆర్మీ సిబ్బంది పాల్గొన్నారు. బోరుబావిలో నీరు క్రమంగా పెరగడం, అస్థిర నేల, ఏకధాటిగా వర్షం వల్ల రెస్క్యూ ఆపరేషన్ ఆలస్యమైంది.