న్యూఢిల్లీ: టెలికాం శాఖకు చెందిన ఖరీదైన పరికరాలను ఎత్తుకెళ్తున్న 27 ఏళ్ల వ్యక్తిని ఢిల్లీ పోలీసులు పట్టుకున్నారు. టెలికాం టవర్లలో ఉపయోగించే ఆర్ఆర్యూ పరికరాలను అతను దొంగలించినట్లు ఆరోపణలు ఉన్నాయి. మొబైల్ కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ ఎత్తుకెళ్తున్న అతన్ని ఢిల్లీ, హరిద్వార్ హైవేపై పట్టుకున్నారు. గతంలో అతను స్క్రాప్ డీలర్(Scrap Dealer)గా చేశాడు. డబ్బులు సంపాదించాలన్న ఆశతో అతను చోరీలకు పాల్పడ్డాడు. నిందితుడిని షావేజ్ అహ్మద్ అలియాస్ ప్రిన్స్ మాలిక్‌గా గుర్తించారు. ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో ఇటీవల అత్యంత ఖరీదైన పరికరాలు చోరీకి గురయ్యాయి. ఆ ఘటనల్లో నమోదైన కేసులు అతనిపై ఉన్నాయి.
మూడు రోజుల పాటు సాగిన ఇంటర్‌స్టేట్ ఆపరేషన్ తర్వాత అతన్ని బంధించారు. పంజాబ్, యూపీల్లో అతని కోసం గాలించారు. పంజాబ్‌లోని రాజ్‌పురా అతని స్వగ్రామం. దొంగలించిన ఆర్ఆర్యూ కార్డులను ఢిల్లీ, మీరట్‌లో అతను అమ్ముకునే నెట్వర్క్ నడిపించాడు. ఫేక్ ఐడెంటిటీ చూపిస్తూ అతను ఇన్నాళ్లు తప్పించుకున్నాడు. అడ్రస్‌లు, ఫోన్ నెంబర్లు మారుస్తూ పరారీ అయినట్లు డీసీపీ విక్రమ్ సింగ్ తెలిపారు. ఢిల్లీ, హరిద్వార్ రహదారిపై ఉన్న ఖతౌలీలో షావేజ్‌ను అదుపులోకి తీసుకున్నారు.
నిందితుడు పాటియాలాలో 8వ తరగతి వరకు చదువుకున్నాడు. షూ షాపులో పనిచేశాడు. స్క్రాప్ డీలర్‌గా చేశాడు. డబ్బు మీద ఆశతో అతను ఆర్ఆర్యూలను దొంగలించడం మొదలుపెట్టినట్లు పోలీసులు చెప్పారు. అతని వద్ద నుంచి రిమోట్ రేడియో యూనిట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీలో అది చోరీకి గురైనట్లు తేలింది. ఆర్ఆర్యూ కార్డుల అమ్మకం ద్వారా అతను అక్రమార్జునకు దిగాడు. అతని వద్ద నుంచి 4 లక్షలు రికవరీ చేశారు. పంజాబ్, హర్యానాల్లో అతనిపై కేసులు ఉన్నాయి.