చండీఘడ్: పంజాబ్ మాజీ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్ని(Charanjit Singh Channi).. గురువారం పంజాబ్ వర్సిటీలో ఎంఏ పరీక్ష రాశారు. ఒకవైపు ఢిల్లీలో కాంగ్రెస్ నేతల భేటీ జరుగుతుండగా, ఆయన మాత్రం వార్షిక వర్సిటీ పరీక్షలకు హాజరయ్యారు. పంజాబ్ యూనివర్సిటీలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మాస్టర్స్ పేపర్‌ను ఆయన రాశారు. చన్నీ వయసు 63 ఏళ్లు. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. మరో వైపు లోక్‌సభ సభ్యుడు కూడారు. ఎంఏ పరీక్ష వల్ల ఆయన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మీటింగ్‌కు దూరంగా ఉన్నారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు ఉన్నా.. ఆయన మాత్రం రాజకీయం కన్నా ఎక్కువ ఆసక్తితో ఎంఏ పరీక్షకు హాజరయ్యారు. కాలేజీ బయట సెక్యూర్టీ వేచి ఉండగా, మాజీ సీఎం చన్నీ మాత్రం ఎగ్జామ్ సెంటర్లో తోటి విద్యార్థులతో కలిసి పరీక్ష రాశారు.
రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తూనే ఆయన పలు పరీక్షలు రాశారు. పంజాబ్ వర్సిటీలో ఆయన బీఏ, ఎల్ఎల్బీ డిగ్రీ పూర్తి చేశారు. ఐకే గుజ్రాల్ పంజాబ్ టెక్నికల్ వర్సిటీ నుంచి ఏంబీఏ పూర్తి చేశారు. పంజాబ్ వర్సిటీ నుంచే పొలిటికల్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ కూడా ఉన్నది. 2023లో ఆయన పంజాబ్ వర్సిటీ నుంచి పొలిటికల్ సైన్స్‌లో పీహెచ్డీ పూర్తి చేశారు. కాంగ్రెస్ పార్టీపైనే ఆయన తన థీసిస్‌ను రాశారు. 2004 నుంచి 2019 మధ్య జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత వ్యూహాలపై ఆయన థీసిస్ ప్రజెంట్ చేశారు.
2022లో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడంతో ఆయన అమెరికా వెళ్లారు. అక్కడ రీసర్చ్ వర్క్ చేశారు. 2021 సెప్టెంబర్‌లో అమరిందర్ సింగ్ తొలగింపు తర్వాత పంజాబ్ సీఎంగా చన్నీ బాధ్యతలు చేపట్టి కొన్ని నెలలే ఆ పోస్టులో ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ జోరులో చన్నీ రెండు సీట్లలో ఓటమి పాలయ్యారు. చామ్‌కౌర్ సాహిబ్, భాదౌర్ స్థానాల్లో పోటీ చేసి పరాజయం చవిచూశారు. 2024లో జలంధర్ స్థానం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు.