బెంగుళూరు : మాజీ ప్రధాని హెచ్డీ దేవగౌడ మనవడు.. హసన్ నియోజకవర్గానికి చెందిన జనతాదళ్ పార్టీ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ(Prajwal Revanna).. అత్యాచారం కేసులో దోషిగా తేలారు. మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలపై విచారణ చేపట్టే ప్రత్యేక కోర్టు రేవణ్ణ కేసులో ఇవాళ తీర్పు ఇచ్చింది. ప్రజ్వల్ రేవణ్ణపై మూడు అత్యాచారం కేసులు ఉన్నాయి. ఒకటి లైంగిక దాడి ఆరోపణ కేసు ఉన్నది. అయితే ఓ కేసులో పూర్తి స్థాయి విచారణ ముగిసింది. హసన్‌లోని గన్నికాడ ఫార్మ్‌హౌజ్‌లో ఉన్న ఇంట్లో 48 ఏళ్ల మహిళ పనిమనిషిగా చేసింది. ఆమెపై రేవణ్ణ లైంగిక దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ బాధితురాలి కేసులో ఇవాళ ప్రత్యేక కోర్టు తీర్పును ఇచ్చింది. అయితే ఆగస్టు 2వ తేదీన ఈ కేసులో శిక్షకు సంబంధించిన తుది తీర్పును ఆ కోర్టు వెల్లడించనున్నది.
అత్యాచార యత్నానికి సంబంధించిన వీడియోను ప్రజ్వల్ షూట్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. కేఆర్ నగర్ పోలీసు స్టేషన్లో ఆ కేసు రిజిస్టర్ చేశారు. స్పెషల్ కోర్టు జడ్జి సంతోష్ గజానన భట్ ఇవాళ తీర్పు ఇచ్చారు. అత్యాచార కేసులో సిట్ దర్యాప్తు చేపట్టింది. ఐపీసీలోని 376(2)(కే), 376(2)(ఎన్), ఐటీ చట్టంలోని 66ఈ సెక్షన్ల కింద రేవణ్ణపై కేసు బుక్ చేశారు.
ఇంట్లో పనిచేసే మహిళపై 2021లో రెండుసార్లు లైంగిక దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. 113 మంది సాక్ష్యులను విచారించారు. జూలై 18వ తేదీన ఈ కేసులో దర్యాప్తు పూర్తి అయ్యింది. అనేక మంది మహిళలపై ప్రజ్వల్ రేవణ్ణ .. అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. గతంలో కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఏప్రిల్ 2023లో ప్రజ్వల్ రేవణ్ణపై తొలిసారి ఫిర్యాదు నమోదు చేశారు.