భోపాల్, డిసెంబర్ 28: బీజేపీకి ఓటువేయాలని ఇకపై తానెప్పుడూ చెప్పబోనని మధ్యప్రదేశ్ మాజీ సీఎం, బీజేపీ నేత ఉమభారతి చెప్పారు. ఏ పార్టీతోనూ రాజకీయ బంధం అవసరంలేదని, తమకు నచ్చిన వారికి స్వేచ్ఛగా ఓటు వేసుకోవచ్చునని అన్నారు. మధ్యప్రదేశ్లో బీజేపీకి ప్రధాన ఓటుబ్యాంకుగా ఉన్న లోధి కమ్యూనిటీకి చెందిన వారిని ఉద్దేశించి ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. తాను లోధి కమ్యూనిటీకి చెందినప్పటికీ తమ కులానికి చెందినవారందరూ బీజేపీకే ఓటు వేయాలని తాను కోరబోనని స్పష్టంచేశారు. భోపాల్లోని మానస్భవన్లో నిర్వహించిన లోధి యువతీ యువకుల పరిచయ సమ్మేళనానికి ఉమాభారతి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్మీడియాలో వైరల్గా మారడంతో బీజేపీ నాయకుల్లో కలవరం మొదలైంది. ‘మిమ్మల్ని బీజేపీకే ఓటు వేయాలని కోరను. మీ అభిరుచులకు అనుగుణంగా నిర్ణయించుకోండి. నాకు సంబంధించినంత వరకు రాజకీయ బంధం నుంచి మీరిక విముక్తి పొందారు’ అని ఉమా భారతి పేర్కొన్నారు.