చెన్నై: భారత సైన్యం మాజీ చీఫ్ జనరల్ సుందరరాజన్ పద్మనాభన్ (83) సోమవారం కన్నుమూశారు. వృద్ధాప్య కారణాల వల్ల ఆయన తుది శ్వాస విడిచినట్లు సమాచారం. ఆయన 2000 సెప్టెంబరు 30 నుంచి 2002 డిసెంబరు 31 వరకు ఆర్మీ చీఫ్‌గా పని చేశారు. 15 కోర్ కమాండర్‌గా ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా అతి విశిష్ట్ సేవా పతకాన్ని ప్రభుత్వం ప్రదానం చేసింది.
‘రిటైల్’లో 26 వేల ఉద్యోగాల కోత
తక్కువ డిమాండ్, విస్తరణ లేకపోవడం వల్లే
న్యూఢిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరంలో దేశంలో డజనుకు పైగా రిటైల్ కంపెనీలు 26 వేల మంది ఉద్యోగులను తొలగించాయి. లైఫ్ ైస్టెల్, కిరాణా, క్విక్ సర్వీస్ రెస్టారెంట్లు ఈ జాబితాలో ఉన్నాయి. వ్యాపార డిమాండ్ తక్కువగా ఉండటం, స్టోర్ల విస్తరణ నెమ్మదిగా చేయడం వల్ల ఉద్యోగాల్లో కోతలు విధించాల్సి వచ్చిందని ఆయా కంపెనీలు తెలిపాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ రిటైల్ విభాగం, టైటాన్, రేమండ్, పేజ్ ఇండస్ట్రీస్, స్పెన్సర్ ఉద్యోగులను ఎక్కువగా తొలగించిన కంపెనీల జాబితాలో ఉన్నాయి. మొత్తం ఉద్యోగుల్లో 17 శాతం మందిని ఈ కంపెనీలు తొలగించాయి.
మరోవైపు కోతలపై రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సీఈవో కుమార్ రాజగోపాలన్ మాట్లాడుతూ.. ‘ప్రతిభకు కొరత ఉంది. ఈ విషయంలో మేము విశ్వవిద్యాలయాలతో కలిసి పని చేస్తున్నాం. వ్యాపారాలను మూసేయడం వల్ల కొన్ని కంపెనీలు ఉద్యోగులను తగ్గిస్తున్నాయి. అయితే షాపర్స్ స్టాప్, ట్రెంట్ లాంటి కంపెనీలు స్టోర్ల విస్తరణ చేపడుతూ అదనపు సిబ్బందిని నియమించుకుంటున్నాయి’ అని తెలిపారు. ద్రవ్యోల్బణం, పెరుగుతున్న వడ్డీ రేట్లు, స్టార్టప్, ఐటీ రంగాల్లో ఉద్యోగాల కోత, ఆర్థిక మందగమనం వల్ల అత్యవసరం కాని వస్తువుల కొనుగోళ్లు 2022 నుంచి తగ్గాయని ఓ నివేదిక తెలిపింది.