న్యూఢిల్లీ: ప్రఖ్యాత కార్ల కంపెనీ ఫోర్డ్ ఇండియాలో ప్రెసిడెంట్, ఎండీగా ఇంతకాలం బాధ్యతలు చేపట్టిన అనురాగ్ మెహ్రోత్రా ఆ కంపెనీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన టాటా మోటార్స్ కంపెనీలో ఉపాధ్యక్షుడిగా ఉద్యోగంలో చేరినట్లు సమాచారం. శుక్రవారం నాడు ఆయన ఈ బాధ్యతలు స్వీకరిస్తారని టాటా మోటార్స్ సంస్థ ఉద్యోగులకు పంపిన కమ్యూనికేషన్లో తెలిపింది.
ఫోర్డ్ ఇండియా కంపెనీలో గడిచిన పదేళ్లుగా అనురాగ్ పనిచేస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఫోర్డ్ ఇండియా అధ్యక్షుడు, మేనేజింగ్ డైరెక్టర్ నియమితులయ్యారు. ఇదిలా వుండగా, భారత్లో కార్ల తయారీని నిలిపివేయాలని ఫోర్డ్ కంపెనీ నిర్ణయించింది. దీనిపై అనురాగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ క్రమంలోనే ఆ కంపెనీకి వీడ్కోలు పలికినట్లు తెలుస్తోంది. ప్రస్తుత భారతీయ మార్కెట్లో కార్లు తయారు చేసి అమ్మడం లాభదాయకంగా లేదని ఫోర్డ్ భావించింది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ నిర్ణయం పట్ల అసంతృప్తితోనే ఫోర్డ్ ఇండియాకు అనురాగ్ రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.