(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జనవరి 21 (నమస్తే తెలంగాణ): గతంలో వైర్లతో నడిచే ల్యాండ్‌లైన్ ఫోన్లు ఉండేవి. అనంతరం డిజిటల్ విప్లవంతో వైర్లెస్ టెక్నాలజీతో నడిచే మొబైల్స్ అందుబాటులోకి వచ్చాయి. దీంతో వైర్ల గొడవ లేకుండా పోయింది. ఇంటర్నెట్ విషయంలోనూ ఇదే సూత్రం పనిచేసింది. అయితే, విద్యుత్తు సరఫరాకు మాత్రం ఇప్పటికీ వైర్లమీదనే ఆధారపడే పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా దీనికి చెక్ పెడుతూ ఫిన్లాండ్లోని యూనివర్సిటీ ఆఫ్ హెల్సింకీ, యూనివర్సిటీ ఆఫ్ ఔలు శాస్త్రవేత్తలు ప్రపంచంలోనే తొలిసారిగా గాలి ద్వారా కరెంటును సైప్లె చేశారు.
ఎలా చేశారంటే??
గాలి ద్వారా కరెంటును సరఫరా చేయడానికి తొలుత అల్ట్రాసానిక్ శబ్ద తరంగాలను, లేజర్లు, ప్రత్యేక రేడియో ఫ్రీక్వెన్సీని శాస్త్రవేత్తలు సిద్ధం చేసుకొన్నారు. అకోస్టిక్ వైర్‌గా (అదృశ్య వైరు) పిలిచే ఈ ప్రత్యేక ఛానల్ గుండా కరెంటును లక్షిత ప్రాంతానికి పంపించారు. విద్యుత్తును కాంతిగా మార్చి అనంతరం మళ్లీ విద్యుత్తుగా బట్వాడా చేయడంలో లేజర్లు కీలకంగా పని చేశాయని పరిశోధకులు తెలిపారు.
తక్కువ మోతాదులో
ఎలక్ట్రానిక్, స్మార్ట్ డివైజ్‌లు పనిచేయడానికి అవసరమయ్యే అత్యంత తక్కువ మోతాదు కలిగిన కరెంటును తాజా ప్రయోగంలో పంపించినట్టు పరిశోధకులు పేర్కొన్నారు. ప్లగ్స్, వైర్లు, కేబుల్స్‌ను ఏ మాత్రం వినియోగించలేదని గుర్తు చేశారు. ఎక్కువ స్థాయిలో కరెంటు సరఫరాకు మరిన్ని ప్రయోగాలు చేయాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు.