భోపాల్: తనతో మాట్లాడటం మానేసినందుకు టీనేజ్ బాలికను క్లాస్మేట్ చంపాడు. పొలంలో యువతి మృతదేహం ఉన్నట్లు తెలుసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 12వ తరగతి విద్యార్థిని ఆమె క్లాస్మేట్ హత్య చేశాడని తెలుసుకున్నారు. (Girl Killed By Classmate) పోలీసులు ఆ యువకుడ్ని అదుపులోకి తీసుకున్నారు. మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. శనివారం ఉమర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వ్యవసాయ క్షేత్రంలో 12వ తరగతి విద్యార్థిని మృతదేహం ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో వారు అక్కడకు చేరుకున్నారు. 17 ఏళ్ల యువతి మృతదేహాన్ని గుర్తించారు. పోస్ట్మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
కాగా, విద్యార్థిని హత్యపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. క్లాస్మేట్ ఆమెను వేధిస్తున్నాడని తెలుసుకున్నారు. ఆ యువకుడ్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. తనతో మాట్లాడటం మానేసినందుకు తాను కలత చెందినట్లు అతడు పోలీసులకు తెలిపాడు. శుక్రవారం రాత్రి వ్యవసాయ క్షేత్రంలో తనను కలవమని బాలికను కోరినట్లు చెప్పాడు. అక్కడకు వచ్చిన ఆ యువతిని పదునైన ఆయుధంతో పొడిచి హత్య చేసినట్లు ఒప్పుకున్నాడని పోలీస్ అధికారి వివరించారు. ఈ సంఘటనపై మరింతగా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.