కోల్కతా: పశ్చిమ బెంగాల్లో రెండు కీలక స్థానాల్లో అభ్యర్థులను బీజేపీ ఇంకా తేల్చలేదు. ఆ రాష్ట్రంలోని అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) దీనిపై వినూత్నంగా విమర్శించింది. బీజేపీకి ‘అభ్యర్థులు కావాలి’ అంటూ పోస్టర్లు ఏర్పాటు చేసింది. (Trinamool’s poster dig at BJP) లోక్సభ ఎన్నికలకు సంబంధించి అసన్సోల్, డైమండ్ హార్బర్ స్థానాలకు అభ్యర్థులను బీజేపీ ఇంకా ప్రకటించలేదు. దీంతో ఈ రెండు నియోజకవర్గాల్లో బీజేపీకి ‘అభ్యర్థులు కావాలి’ అంటూ పోస్టర్లను టీఎంసీ ఏర్పాటు చేసింది. బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడైన సువేందు అధికారి డైమండ్ హార్బర్ నుంచి పోటీ చేయాలని టీఎంసీ సవాల్ చేసింది. టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ ఈ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు.
కాగా, భోజ్పురి గాయకుడు పవన్ సింగ్ను అసన్సోల్ అభ్యర్థిగా బీజేపీ తొలుత ప్రకటించింది. మహిళలపై ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో మహిళల నుంచి నిరసనలు వ్యక్తం కావడంతో పోటీకి వెనుకడుగు వేశారు. అయితే తన తల్లి, ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు ఎన్నికల్లో పోటీ చేస్తానని మార్చి 13న పవన్ సింగ్ ట్వీట్ చేశారు. అయినప్పటికీ ఆ సీటు అభ్యర్థిని బీజేపీ ఖరారు చేయలేదు. దీంతో అసన్సోల్లో ఆ పార్టీకి అభ్యర్థి లేకుండాపోయారని టీఎంసీ నేత రిజు దత్తా విమర్శించారు.