చండీగఢ్: తాగేందుకు నీరు ఇవ్వని కుమారుడిపై తండ్రి ఆగ్రహించాడు. మద్యం మత్తులో ఉన్న అతడు ఆరేళ్ల కొడుకును కొట్టి చంపాడు. (Drunk Man Beats Son To Death) భార్య ఫిర్యాదుతో పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. ఢిల్లీ శివారు ప్రాంతమైన హర్యానాలో గురుగ్రామ్‌లో ఈ సంఘటన జరిగింది. బీహార్‌లోని ముజఫర్‌నగర్ జిల్లాకు చెందిన సుమన్ కుమార్ సింగ్ తన కుటుంబంతో కలిసి గురుగ్రామ్‌లోని ఒక ప్రాంతంలో నివసిస్తున్నాడు. కూలీ పని చేస్తున్న అతడు మద్యానికి బానిస అయ్యాడు.
కాగా, మే 6న కూలీ పని దొరకపోవడంతో సుమన్ కుమార్ ఇంటికి తిరిగి వచ్చాడు. ఇంటి వద్ద మద్యం సేవించాడు. ఆరేళ్ల కొడుకు సత్యంను తాగునీరు ఇవ్వమని అడిగాడు. నిరాకరించిన కుమారుడు మద్యం తాగడం గురించి తల్లికి చెబుతానని అన్నాడు. దీంతో ఆగ్రహించిన సుమన్, కుమారుడి తలను గోడకేసి పలుమార్లు బాదాడు.
మరోవైపు తీవ్రంగా గాయపడిన బాలుడు సత్యంను తొలుత స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అతడి పరిస్థితి విషమించడంతో రోహ్తక్లోని మెడికల్ కాలేజీ హాస్పిటల్‌కు తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆ బాలుడు మరణించాడు. ఈ నేపథ్యంలో మే 7న సత్యం తల్లి తన భర్త సుమన్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేశారు. అతడ్ని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. రిమాండ్ నిమిత్తం జైలుకు తరలించినట్లు పోలీస్ అధికారి తెలిపారు.