చెన్నై: అమెరికాకు చెందిన డాక్టర్ వద్ద శాటిలైట్ ఫోన్ను (satellite phone) ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ సిబ్బంది గుర్తించారు. దీంతో విమానం ఎక్కకుండా ఆమెను నిలువరించారు. భారత్లో నిషేధించిన శాటిలైట్ ఫోన్ను ఆ డాక్టర్ కలిగి ఉండటంపై పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. అమెరికాకు చెందిన 32 ఏళ్ల రాచెల్ అన్నే స్కాట్ కంటి వైద్యురాలు. కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలోని అరవింద్ కంటి ఆసుపత్రి వైద్యులను సందర్శించడానికి ఆమె అక్కడకు వెళ్లింది.
కాగా, అనంతరం హైదరాబాద్కు వెళ్లేందుకు పుదుచ్చేరి ఎయిర్పోర్టకు రాచెల్ అన్నే స్కాట్ చేరుకున్నది. తనిఖీ సందర్భంగా అమెరికా డాక్టర్ వద్ద ఇరిడియం శాటిలైట్ ఫోన్ ఉన్నట్లు సెక్యూరిటీ సిబ్బంది గుర్తించారు. ఈ నేపథ్యంలో విమానం ఎక్కకుండా ఆమెను నిలువరించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు దర్యాప్తు చేస్తున్నారు. అమెరికాకు చెందిన డాక్టర్ రాచెల్ అన్నే స్కాట్ తమిళనాడులోని మధురైతో పాటు మరికొన్ని ప్రాంతాలను సందర్శించినట్లు తెలుసుకున్నారు.
మరోవైపు తురాయ, ఇరిడియం వంటి ఉపగ్రహ ఫోన్లను ముందస్తు అనుమతి లేకుండా భారత్లో వినియోగించడాన్ని టెలికమ్యూనికేషన్ల శాఖ నిషేధించింది. దీంతో దేశంలోని అన్ని విమానయాన స్థంస్థలు ఈ నిషేధం గురించి ప్రకటించాలని, విదేశీ కార్యాలయాలు, విమాన మ్యాగజైన్ల ద్వారా ప్రయాణికులకు తెలియజేయాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఈ ఏడాది జనవరి 30న ఆదేశించింది. ఈ నేపథ్యంలో శాటిలైన్ ఫోన్లు కలిగిన అమెరికా జాతీయులను డెహ్రాడూన్, చెన్నై విమానాశ్రయాల్లో ఇటీవల నిర్బంధించారు.