న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20: సామాజిక మాధ్యమాలపై హాస్యం పేరిట అశ్లీలత వ్యాప్తి చెందడంపై వివాదం ఏర్పడిన నేపథ్యంలో కేంద్రం చర్యలకు ఉపక్రమించింది. చట్టం నిషేధించిన కంటెంట్‌ను ప్రసారం చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లను కేంద్రం హెచ్చరించింది. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లతోపాటు సోషల్ మీడియా వేదికలు కంటెంట్‌ను ప్రసారం, ప్రచురణ చేసే సమయంలో 2021 నాటి ఐటీ నిబంధనల కింద నిర్దేశించిన నైతిక నియమావళికి (కోడ్ ఆఫ్ ఎథిక్స్) కట్టుబడి ఉండాలని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ గురువారం ఆదేశించింది.
కంటెంట్‌ను ప్రసారం లేదా ప్రచురించే సమయంలో వయసు ఆధారంగా వర్గీకరణను కచ్ఛితంగా పాటించాలని తెలిపింది. ఏ రేటెడ్ కంటెంట్‌ను ప్రసారం చేసే విషయంలో చట్ట నిబంధలకు లోబడి వ్యవహరించాలని ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లను ఆదేశించింది. సుప్రీంకోర్టు ఇటీవల చేసిన సూచనల మేరకు కేంద్రం నుంచి ఈ ఆదేశాలు వెలువడ్డాయి.