న్యూఢిల్లీ: ఉత్తరాది రాష్ట్రాల్లో ఎడతెరపి లేకుండా కురుస్తున్న పొగమంచు నార్తర్న్ రైల్వే రీజియన్‌లోని రైళ్ల రాకపోకలపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. ఉత్తరాదిలోని పలు ప్రాంతాల్లో దట్టంగా పొగమంచు కమ్మి ఉండటంతో విజిబిలీటీ బాగా తగ్గిపోయింది. ట్రాక్ సరిగా కనిపించడంలేదు. దాంతో రైళ్లు నిదానంగా రాకపోకలు సాగిస్తున్నాయి.
దేశవ్యాప్తంగా మొత్తం 42 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఆలస్యంగా నడుస్తున్న రైళ్లలో.. పూరి-న్యూఢిల్లీ పురుషోత్తం ఎక్స్‌ప్రెస్ (4.30 గంటలు ఆలస్యం), గయ-న్యూఢిల్లీ మహబూది ఎక్స్‌ప్రెస్ (4.30 గంటలు ఆలస్యం), బరౌనీ-న్యూఢిల్లీ క్లోన్ స్పెషల్ (4.10 గంటలు ఆలస్యం), హౌరా-న్యూఢిల్లీ పూర్వ ఎక్స్‌ప్రెస్ (4.30 గంటలు ఆలస్యం), భాగల్పూర్-ఆనంద్ విహార్ విక్రమ్‌శీల ఎక్స్‌ప్రెస్ (3.50 గంటలు ఆలస్యం), రేవా-ఆనంద్ విహార్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (5 గంటలు ఆలస్యం) ఉన్నాయి.
తెలంగాణకు రాకపోకలు సాగించే రైళ్లు..
పొగమంచు కారణంగా ఆలస్యంగా నడుస్తున్న రైళ్లలో తెలంగాణకు రాకపోకలు సాగించే రైళ్లు కూడా మూడు ఉన్నాయి. విశాఖపట్నం-న్యూఢిల్లీ మధ్య తిరిగే ఆంధ్రప్రదేశ్ ఎక్స్‌ప్రెస్ 2.30 గంటలు ఆలస్యంగా, నాంపల్లి-హజ్రత్ నిజాముద్దీన్ మధ్య తిరిగే దక్షిణ్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ 4.15 గంటలు ఆలస్యంగా నడుస్తుండగా.. నాంపల్లి-న్యూఢిల్లీ మధ్య రాకపోకలు సాగించే తెలంగాణ ఎక్స్‌ప్రెస్ 2.30 గంటలు ఆలస్యంగా నడుస్తున్నది.