న్యూఢిల్లీ: బెడ్ బాక్స్‌లో ఒక మహిళ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. భర్త పరారీలో ఉన్నట్లు తెలుసుకున్నారు. పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించిన ఫ్లాట్ యజమానిని అరెస్ట్ చేశారు. (woman’s body in bed box) దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. మార్చి 28న వివేక్ విహార్‌లోని సత్యం ఎన్‌క్లేవ్‌లో ఒక ఫ్లాట్ నుంచి దుర్వాసన వస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఆ ఫ్లాట్‌కు తాళం వేసి ఉండటాన్ని గమనించారు. వెనుక డోర్ వద్ద రక్తం మరకలు కనిపించాయి. దీంతో తలుపు బద్దలుకొట్టి లోపలకు వెళ్లి చూశారు. బ్లాంకెట్‌తో చుట్టిన బ్యాగ్‌లో ఉంచి బెడ్ బాక్స్‌లో దాచిన 35 ఏళ్ల మహిళ మృతదేహాన్ని వెలికితీశారు.
కాగా, మృతురాలిని పంజాబ్‌లోని లూథియానాకు చెందిన 35 ఏళ్ల అంజు అలియాస్ అంజలిగా పోలీసులు గుర్తించారు. ఆమెను ఢిల్లీకి తీసుకువచ్చి హత్య చేసినట్లు తెలుసుకున్నారు. శుక్రవారం రాత్రి ఆనంద్ విహార్‌లోని సూరజ్మల్ పార్క్ సమీపంలో 65 ఏళ్ల ఇంటి యజమాని వివేకానంద మిశ్రాను అదుపులోకి తీసుకున్నారు. అతడ్ని ప్రశ్నించగా తన అనుచరుడు అభయ్ కుమార్ ఝా అలియాస్ సోను, మహిళ భర్త ఆశిష్ కుమార్‌తో కలిసి ఆ మహిళను హత్య చేసినట్లు చెప్పాడు.
మరోవైపు రైలులో బీహార్‌కు పారిపోతున్న సోనూను అలిగఢ్ రైల్వే స్టేషన్లో జీపీఆర్ పోలీసుల సహాయంతో అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మహిళ భర్త అభయ్ కుమార్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆ మహిళను ఎందుకు హత్య చేశారో అన్నది దర్యాప్తు చేస్తున్నారు.