శ్రీనగర్, అక్టోబర్ 26: జమ్ముకశ్మీర్లో పోలీసులు, భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ఐదుగురు లష్కరే తాయిబా ఉగ్రవాదులు హతమయ్యారు. కుప్వారా జిల్లాలోని మచ్చిల్ సెక్టార్లో నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వద్ద భారత్లోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన ఐదుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టినట్టు కశ్మీర్ అదనపు డీజీపీ విజయ్ కుమార్ తెలిపారు.
మృతులను లష్కరే తాయిబా ఉగ్రవాదులుగా గుర్తించామని, వారి నుంచి ఏకే సిరీస్ తుపాకులు, పెద్దయెత్తున ఆయుధ సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. ఇటీవలి కాలంలో నియంత్రణ రేఖ వెంబడి చొరబడటానికి ఉగ్రవాదులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని, అయితే వాటిని తాము ఎప్పటికప్పుడు తిప్పికొడుతున్నామన్నారు. నాలుగు రోజుల క్రితం ఉరి సెక్టార్లో ఇద్దరిని, అలాగే జూన్లో 11 మంది ఉగ్రవాదులను హతమార్చినట్టు చెప్పారు.