శ్రీనగర్, మే 24: మొట్టమొదటిసారి జమ్ము కశ్మీర్ పోలీసులు అడవిలో యుద్ధం చేయడంపై శిక్షణ పొందనున్నారు. స్పెషల్ ఆపరేషన్స్ గ్రూపు(ఎస్ఓజీ) సిబ్బంది అడవిలో యుద్ధం చేయడానికి సంబంధించిన శిక్షణ పొందేందుకు సంసిద్ధమవుతున్నారు. జమ్ము కశ్మీరులోని పర్వత ప్రాంతాలు, లోయలతో నిండిన అటవీ ప్రాంతాలు ఉగ్రవాదులకు వరంగా మారడంతో ఈ ప్రాంతాలపై పట్టు లేని ఎస్ఓజీ సిబ్బందికి ఈ ప్రాంతాలలో యుద్ధం చేయడానికి అవపరమైన శిక్షణను అందచేయనున్నారు.
నిఘా వర్గాల నుంచి ముందస్తు సమాచారం లేకపోవడం, దట్టమైన అడవులతో కూడిన పర్వత ప్రాంతం కావడంతో ఉగ్రవాదుల కోసం భద్రతా సిబ్బంది ముందుకు వెళ్లలేని పరిస్థితి వంటివి పహల్గాం దాడి ద్వారా నేర్చుకున్న పాఠాలని, వీటిని అధిగమించడానికే అడవిలో గెరిల్లా యుద్ధ నైపుణ్యాలపై శిక్షణ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
2023లో జమ్ము కశ్మీర్ డీజీపీగా బాధ్యతలు చేపట్టిన ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి నళిన్ ప్రభాత్ ఆలోచనా ఫలితమే ఈ నిర్ణయమని తెలుస్తోంది. అడవులు, ఎత్తయిన పర్వత ప్రాంతాలలో యుద్ధ శిక్షణ పొందాలని ఎస్ఓజీ యూనిట్లను ప్రభాత్ ఆదేశించారు. శిక్షణలో ఎంత ఎక్కువగా చెమట చిందిస్తే ఉగ్రవాదులతో జరిపే సమరంలో అంత తక్కువ రక్తం పారుతుంది అని ఓ సీనియర్ పోలీసు అధికారి వ్యాఖ్యానించారు. కొన్ని బృందాలు ఇప్పటికే కఠిన శిక్షణను పూర్తి చేసుకోగా ఇతర బృందాలు శిక్షణ పొందేందుకు సిద్ధమవుతున్నాయి.