ముంబై, జూలై 31: జైపూర్-ముంబై ఎక్స్ప్రెస్ రైల్లో కాల్పులు కలకలం సృష్టించాయి. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) కానిస్టేబుల్ జరిపిన కాల్పుల్లో నలుగురు మృతిచెందారు. కాల్పులు జరిపి పారిపోతున్న కానిస్టేబుల్ను రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. సోమవారం తెల్లవారుజామున పాల్ఘర్ స్టేషన్ సమీపంలో ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ చేతన్సింగ్ తన సీనియర్ ఏఎస్సై టికారామ్ మీనాను కాల్చి చంపేశాడు. అనంతరం తర్వాతి బోగీలోని ముగ్గురు ప్రయాణికులపై కాల్పులు జరుపగా, వారు అక్కడికక్కడే మృతి చెందారు.
తర్వాతి స్టేషన్లో నిందితుడు రైలు దూకి పారిపోతుండగా రైల్వే పోలీసులకు చిక్కాడు. దీనిపై ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ జనరల్ (పశ్చిమ రైల్వే) ప్రవీణ్ సిన్హా మాట్లాడుతూ చేతన్సింగ్కు షార్ట్ టెంపర్ ఉందని వెల్లడించారు. ఆ సమయంలో రైలులో పెద్దగా గొడవేమీ జరుగలేదని, కానీ క్షణికావేశంలో అతడు తన సీనియర్ అధికారిని కాల్చి చంపాడని వెల్లడించారు. అనంతరం ఈ ఘటనను చూసినవారిని కాల్చుకుంటూ పోయాడని తెలిపారు.