Pak Afghan Troops| పాకిస్తాన్, అఫ్గనిస్తాన్ మధ్య సరిహద్దు వివాదం మరోసారి చిచ్చు పెట్టింది. డురండ్ ప్రాంతంలో పాకిస్తాన్, ఆఫ్గనిస్తాన్ సైనికుల మధ్య భీకర కాల్పులు జరిగాయి. దాదాపు 30 నిమిషాల పాటు ఇరు పక్షాల మధ్య కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. స్థానిక మీడియా విడుదల చేసిన చిత్రాల ప్రకారం ఇరు పక్షాలూ కాల్పులు జరుపుకున్నాయి. అయితే మొదట అప్గాన్ సైనికుల వైపు నుంచే కాల్పులు జరిగినట్లు సమాచారం. పాకిస్తాన్‌కు చెందిన ఓ సైనికుడు సరిహద్దుల్లో ఫెన్సింగ్ పనుల్లో నిమగ్నమై ఉన్న సమయంలోనే అఫ్గన్ సైనికులు పాక్ సైనికుడిపై కాల్పులు జరిపాడు. దీంతో పాక్ సైనికులు కూడా ఫైరింగ్ ప్రారంభం చేశారు. దీంతో ఇరు పక్షాల మధ్య భీకరంగా కాల్పుల మోత జరిగింది.
ఇరు పక్షాల మధ్య ఉన్న కంచె సమస్యను పరిష్కరించుకున్నామని ప్రకటన వచ్చిన కొన్ని రోజులకే మళ్లీ కాల్పులు జరగడం గమనించాల్సిన అంశం. ఈ భీకర కాల్పుల తర్వాత ఓ ఉన్నతాధికారి మాట్లాడుతూ… వివాదంగా మిగిలిపోయిన సమస్యలపై భవిష్యత్తులో శాంతియుతంగా పరిష్కరించుకోవాలని ఇరు దేశాలూ నిర్ణయించుకున్నాయని ఆయన వెల్లడించారు. అయితే ఏ స్థాయి అధికారుల మధ్య ఈ చర్చలు జరిగాయన్నది మాత్రం ఆయన వెల్లడించలేదు. అయితే పాకిస్తాన్‌కు సంబంధించిన ప్రముఖ డాన్ పత్రిక మరోలా పేర్కొంటోంది. తాము సరిహద్దుల్లో కంచె నాటుతున్న సమయంలో ఆఫ్గన్‌కు చెందిన కొందరు ఆ కంచెను అడ్డుకున్నారని, వైర్‌ను తీసుకెళ్లిపోయారని ఓ కథనంలో పేర్కొంది.
2017 నుంచీ ఈ రెండు దేశాల మధ్య సరిహద్దు వివాదం కొనసాగుతోంది. అఫ్గన్ నుంచి అక్రమ చొరబాట్లను అడ్డుకోడానికి, ఉగ్రవాద చొరబాట్లను అడ్డుకోడానికి 26000 కిలోమీటర్ల మేర కంచె నాటాలని పాక్ నిర్ణయించింది. కేవలం కంచె నాటడమే కాకుండా బార్డర్ చెక్ పోస్టులను కూడా నిర్మిస్తోంది. దాదాపు 90 శాతం పనులను కూడా పాక్ పూర్తి చేసింది. అయితే ఈ సరిహద్దులను అఫ్గన్ ఏమాత్రం ఒప్పుకోవడం లేదు. చాలా సంవత్సరాల క్రితం వీటిని నిర్ణయించారని అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అయితే డ్యూరండ్ రేఖ ఆధారంగా సరిహద్దులను నిర్ణయించాలని అఫ్గన్ నిర్ణయించుకుంది. ఈ నిర్ణయాన్ని పాక్ వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య తీవ్రమైన విభేదాలు పొడసూపుతున్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
రైలంటే రైలూ కాదు.. బస్సంటే బస్సూ కాదు