కేరళలోని కొట్టాయం మెడికల్ కాలేజీలో అగ్ని ప్రమాదం సంభవించింది. కాలేజీ వెనుక ఉన్న ఓ చెత్త కుప్పలోని వ్యర్థాలను కార్మికులు తొలగిస్తున్న సమయంలో ఈ మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. దీంతో కార్మికులందరూ ఒక్క సారిగా అక్కడి నుంచి పరుగులు తీయడంతో ఆ ప్రమాదం నుంచి తప్పించుకున్నారని తెలుస్తోంది. ఆ చెత్తకుప్పలోంచి మంటలు మెళ్లి మెళ్లిగా కాలేజీ వైపు పాకినట్లు చెబుతున్నారు. మంటలు భారీగా చెలరేగడంతో వాటిని అదుపు చేయడం కష్టతరమైంది. దీంతో అధికారులు ఫైరింజన్లను రంగంలోకి దింపారు. రెండు ఫైరింజన్లు ఘటనా స్థలికి వచ్చి, మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే ప్రస్తుతానికి మాత్రం ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.