Basangouda Patil | కర్నాటక బీజేపీ ఎమ్మెల్యే బసంగౌడ పాటిల్ యత్నాల్ చిక్కుల్లో పడ్డారు. మత సామరస్యం దెబ్బతీసే విధింగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై ఆయనపై కేసు నమోదైంది. ముస్లిం యువతులను పెళ్లి చేసుకునే హిందూ యువతులకు రూ.5లక్షల ఇస్తానంటూ ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఆయనపై కలబురగి రొజా పోలీస్‌స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఖిద్మత్-ఎ-మిల్లత్ కమిటీ అధ్యక్షుడు జునైద్ ఖురేషి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే హిందూ యువకులను రెచ్చగొడుతూ ఓ వర్గం సమాజాన్ని లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు.
భారతీయ న్యాయ సంహిత (BNS) చట్టంలోని సెక్షన్లు 196, 299, 353(1)(c), 353(2) కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఖురేషి ఈ నెల 12న రాత్రి 10.30 గంటల ప్రాంతంలో పోలీస్‌కు ఫిర్యాదును పోలీసులకు అందజేశారు. యత్నాల్ కొన్ని సంవత్సరాలుగా సమాజాలను విభజించడం, ఓ నిర్దిష్ట సమూహాన్ని వేరు చేయడం, శాంతిని దెబ్బతీసే లక్ష్యంతో పదే పదే ప్రసంగాలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా ఆగస్టు 11న కొప్పల్‌లో ఎమ్మెల్యే చేసిన ప్రసంగాన్ని ఫిర్యాదులో ప్రస్తావించారు. ముస్లిం యువతులను వివాహం చేసుకునే యువకులకు రూ.5లక్షల నగదు ప్రోత్సాహకం ఇస్తానని బహిరంగంగా ప్రకటించారని.. ఈ ప్రకటన ఓ సమాజాన్ని రెచ్చగొట్టేలా ఉందని.. మరొక సమాజాన్ని లక్ష్యంగా చేసుకోవడానికి ప్రయత్నం అని, తద్వారా కలబురగి, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలో తీవ్రమైన శాంతిభద్రతల విఘాతం కలిగించే అవకాశం ఉందని ఖురేషి ఆరోపించారు.
ఇలాంటి ప్రకటనలు విభజన, ద్వేషాన్ని ప్రోత్సహిస్తాయని.. సంబంధాలు దెబ్బతీస్తాయని పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేరస్తున్నారు. యత్నాల్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు రెచ్చగొట్టేలా ఉన్నాయని పలువురు పేర్కొన్నారు. పలువురు ఆయన మద్దతుదారులు వ్యక్తిగత అభిప్రాయమని వ్యాఖ్యానించారు. తాజాగా ఎమ్మెల్యేపై కేసు నమోదుకావడంతో రాజకీయాలు వేడెక్కాయి.