Finger in Ice cream case : ఆన్లైన్లో ఆర్డర్ చేసిన ఐస్‌క్రీమ్‌లో తెగిపడిన మనిషి వేలు వచ్చిన ఘటనపై దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతున్నది. ఆ ఐస్ క్రీమ్‌లో వచ్చిన వేలు ఎవరిదో పోలీసులు నిర్ధారించారు. అయితే తెగిపడిన ఆ వేలు ఐస్‌క్రీమ్‌లో రావడం వెనుక ఎవరి నిర్లక్ష్యం ఉందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వివరాలను ముంబైలోని మలాద్ పోలీస్‌స్టేషన్‌కు చెందిన సీనియర్ పోలీస్ ఇన్స్పెక్టర్ రవి అదానే వెల్లడించారు. ‘ఐస్ క్రీమ్‌లో వచ్చిన వేలును డీఎన్ఏ పరీక్షకు పంపించాం. కంపెనీలో అసిస్టెంట్ ఆపరేటర్ మేనేజర్‌గా పనిచేస్తున్న వ్యక్తి డీఎన్ఏను కూడా డీఎన్ఏ పరీక్షకు పంపాం. ఆ రెండు డీఎన్ఏ శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయి. ఇక ఎవరి నిర్లక్ష్యంవల్ల ఐస్‌క్రీమ్‌లోకి వేలు వచ్చిందనే కోణంలో దర్యాప్తు చేస్తాం’ అని రవి అదానే చెప్పారు.
ఘటనపై ఇండియన్ పీనల్ కోడ్‌లోని సెక్షన్లు 272, 273, 336 కింద కేసులు నమోదు చేశామని, తదుపరి దర్యాప్తు కొనసాగుతున్నదని పోలీసులు తెలిపారు. కాగా కొద్ది రోజుల క్రితం ముంబైకి చెందిన ఓ లేడీ డాక్టర్ ఆన్లైన్లో ఐసీక్రీమ్ ఆర్డర్ చేసింది. ఐతే ఐస్‌క్రీమ్‌లో మనిషి వేలు రావడం చూసి ఆమె కంగుతిన్నారు. అనంతరం దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.