న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఆదివారం రాత్రి ధౌలా కూన్ సమీపంలో ఓ బైకును బీఎండబ్ల్యూ కారు ఢీకొట్టింది. దీంతో కేంద్ర ఆర్థిక శాఖ డిప్యూటీ సెక్రటరీ నవ్‌జ్యోత్ సింగ్ (Navjot Singh) అక్కడికక్కడే మృతిచెందారు. ప్రమాదంలో అతని భార్యతోపాటు మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. నవ్‌జ్యోత్ సింగ్ తన భార్యతో కలిసి బైక్‌పై బంగ్లా సాహిబ్ గురుద్వారా వెళ్లివస్తున్నారు. ఈ క్రమంలో రింగురోడ్డుపై వేగంగా దూసుకొచ్చిన బీఎండబ్ల్యూ కారు బైకును ఢీకొట్టింది. అనంతరం డివైడర్‌ను దాటుకుని రోడ్డు అవతలివైపు వెళ్లి ఆగిపోయింది. దీంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.
ప్రమాద సమయంలో కారును ఓ మహిళ నడుపుతున్నదని, ఆమె భర్త కూడా అందులో ఉన్నారని ప్రత్యక్ష సాక్ష్యులు వెల్లడించారు. వారిద్దరు ప్రైవేటు ట్యాక్సీలో దవాఖానకు వెళ్లారని అధికారులు చెప్పారు. నవ్జ్యోత్ను సమీపంలోని హాస్పిటల్‌కు తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు చెప్పారని తెలిపారు. ఆయన సతీమణి చికిత్స పొందుతున్నారని వెల్లడించారు.