త్రిసూర్: కేరళలోని త్రిసూర్(Thrissur) నియోజకవర్గంలో బీజేపీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ స్థానం నుంచి సినీ నటుడు సురేష్ గోపి గెలుపొందారు. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన కే మురళీధరన్ ఓటమి చెందారు. ఈ నేపథ్యంలో అక్కడ జరిగిన కాంగ్రెస్ డీసీసీ భేటీ రణరంగంగా మారింది. కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నది. ఆ తర్వాత కొందరు కార్యకర్తలు కొట్టుకున్నారు. ఈ ఘటనలో త్రిసూర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు జోస్ వల్లూరుపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. డీసీసీ కార్యదర్శి సంజీవన్ కురియచిరా ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా 19 మందిపై కేసు బుక్ చేశారు. వల్లూరుతో పాటు అతని మనుషులు డీసీసీ ఆఫీసులో తనపై దాడి చేసినట్లు కురియచిర తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. వల్లూరు వల్లే మురళీధరన్ ఓడిపోయినట్లు కురియాచిర ఆరోపించారు. దీంతో రెండు వర్గాల మధ్య గొడవ ప్రారంభమైంది. త్రిసూర్ లోక్సభ సీటు నుంచి సురేశ్ గోపి 74 వేల ఓట్ల తేడాతో గెలుపొందారు.