న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్ సర్కారుపై సుప్రీంకోర్టు(Supreme Court) ఆగ్రహం వ్యక్తం చేసింది. జిమ్ కార్బెట్ జాతీయ పార్కులో భారీ సంఖ్యలో చెట్ల నరికివేత, అక్రమ నిర్మాణాన్ని కోర్టు తప్పుపట్టింది. ప్రజల విశ్వాసాన్ని చెత్తకుప్పలో వేశారని కోర్టు సీరియస్ అయ్యింది. ఆ రాష్ట్ర మాజీ మంత్రి హరక్ సింగ్ రావత్‌తో పాటు మాజీ డీఎఫ్‌వో కిషన్ చాంద్‌పై సుప్రీం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. జిమ్ కార్బెట్ పార్కులో చెట్ల నరికివేతకు సంబంధించి ఓ కమిటీని కేంద్రం ఏర్పాటు చేయాలని, అక్కడ జరిగిన నష్టాన్ని బాధ్యులైన వ్యక్తుల నుంచి రికవరీ చేయాలని కోర్టు తన ఆదేశాల్లో స్పష్టం చేసింది.
జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ పీకే మిశ్రా, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఆ కేసును విచారించింది. పర్యావరణవేత్త, న్యాయవాది గౌరవ్ భన్సల్ ఆ పిటీషన్ దాఖలు చేశారు. జాతీయ పార్కులో టైగర్ సఫారీ, జూ ఏర్పాటుకు చేసిన ఉత్తరాఖండ్ ప్రతిపాదనలను భన్సల్ తన పిటీషన్లో ఛాలెంజ్ చేశారు. పార్కులోని బఫర్ జోన్లో మాత్రమే సఫారీ టూర్లు ఉండాలని, కానీ ఆ టూర్లు కచ్చితంగా మార్గదర్శకాలను అనుసరించాల్సి ఉంటుందని కోర్టు తెలిపింది. అక్రమ నిర్మాణాల కోసం జిమ్ కార్బెట్ పార్కులో ఉన్న సుమారు ఆరు వేల చెట్లను నరికివేశారు.