న్యూఢిల్లీ: జనవరి 31న దేశవ్యాప్తంగా ‘ద్రోహ దినం’గా రైతులు పాటిస్తారని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నాయకుడు రాకేష్ టికైత్ తెలిపారు. పంటలకు మద్దతు ధర (ఎంఎస్పీ)పై ఇచ్చిన హామీని కేంద్రం నెరవేర్చాలన్నదే తమ ప్రధాన డిమాండ్ అని చెప్పారు. అలాగే వ్యవసాయ చట్టాల రద్దు కోసం ఏడాదిపాటు సాగిన నిరసనలో రైతులపై నమోదైన కేసులను కూడా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన ఈ హామీలను నెరవేర్చలేదని ఆయన ఆరోపించారు.
2021 డిసెంబరు 9న ఒక లేఖలో కేంద్రం చేసిన వాగ్దానాల ఆధారంగా ఢిల్లీ సరిహద్దుల్లో ఏడాదికి పైగా చేసిన నిరసనలను రైతులు విరమించుకున్నారని రాకేష్ గుర్తు చేశారు. అయితే ఆ హామీలను కేంద్ర ప్రభుత్వం ఇంకా నెరవేర్చలేదని అన్నారు. అందుకే సోమవారం దేశవ్యాప్తంగా ‘ద్రోహ దినం’గా పాటించాలని రైతులు నిర్ణయించినట్లు చెప్పారు.
కాగా, 2021 నవంబర్లో ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటామని తెలిపారు. అనంతరం నవంబర్ 29 నుంచి జరిగిన పార్లమెంట్ శీతాకాల సమావేశంలో వ్యవసాయ చట్టాల రద్దు బిల్లు, 2021కు రెండు ఉభయసభలు ఆమోదం తెలిపాయి. దీంతో ఏడాదిపాటు కొనసాగిన నిరసనలకు రైతులు ముగింపు పలికారు.