న్యూఢిల్లీ, జూలై 21 : నీట్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న యువత డిమాండ్‌తో సోమవారం దద్దరిల్లిన ఢిల్లీలో మంగళవారం కూడా ఆందోళన కొనసాగగా, మరో పక్క కేంద్ర కర్షక వ్యతిరేక విధానాలపై రైతులు కదం తొక్కారు మంగళవారం హస్తినలో కిసాన్ మహాపంచాయత్‌లో పాల్గొనేందుకు పంజాబ్, హర్యానా రైతులు భారీ ప్రదర్శనగా బయలుదేరడంతో ప్రభుత్వం ఉలిక్కిపడింది. ప్రతిపాదిత భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని (ఎఫ్‌టీఏ) నిరసిస్తూ పంజాబ్‌లోని వివిధ ప్రాంతాలకు చెందిన వందలాది మంది రైతులు ‘దేశ్ బచావో మోర్చా’ ఆధ్వర్యంలో ర్యాలీ ప్రారంభించారు. ఈ ఒప్పందాన్ని వెంటనే రద్దు చేయాలని, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్-రైతుల మధ్య సమావేశాన్ని ఏర్పాటు చేయాలని వారు ప్రధానంగా డిమాండ్ చేశారు.
భారత్ చేసుకోనున్న వాణిజ్య ఒప్పందం కారణంగా అమెరికాకు చెందిన సోయాబీన్, డ్రై ఫ్రూట్స్, పాల ఉత్పత్తులు, ధాన్యాలు పెద్దయెత్తున భారత్ మార్కెట్‌ను ముంచెత్తుతాయని, దీని కారణంగా సన్నకారు రైతులు, రైతు కూలీలు, స్థానిక వ్యాపారులు తీవ్రంగా దెబ్బతింటారని రైతు నేతలు తెలిపారు. కాగా, అరెస్ట్ చేసిన రైతు నాయకులను విడుదల చేసేందుకు, వ్యవసాయ శాఖ మంత్రితో భేటీకి హర్యానా ప్రభుత్వం అంగీకరించడంతో రైతులు సరిహద్దుల నుంచి వెనుదిరిగారు. భారత్-అమెరికా ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందానికి నిరసనగా బుధవారం దేశ వ్యాప్తంగా నిరసనలు చేపట్టనున్నట్టు సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) ప్రకటించింది.