శుక్రవారం 22 జనవరి 2021
National - Dec 17, 2020 , 15:04:13

నిరసన తెలిపే హక్కు రైతులకుంది : సుప్రీం కోర్టు

నిరసన తెలిపే హక్కు రైతులకుంది : సుప్రీం కోర్టు

న్యూఢిల్లీ : నిరసన తెలిపే హక్కు రైతులకు ఉందని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో రోడ్లపై బైఠాయించిన రైతులను ఖాళీ చేయించాలని, చట్టాలను రద్దు చేయాలని దాఖలైన పిటిషన్లపై జస్టిస్‌ బొబ్డే నేతృత్వంలోని ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. సాగు చట్టాలను రద్దు చేయాలన్న పిటిషన్ల తర్వాత పరిశీలిస్తామని సీజేఐ తెలిపారు. అనంతరం రైతుల ఆందోళనపై విచారణ జరిపారు. ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. నిరసన తెలియజేయడం రాజ్యాంగ హక్కు అనీ, నిరసన తెలిపే హక్కు రైతులకు ఉందని చెప్పింది. నిరసనలు శాంతియుతంగా కొనసాగాలని, ఆస్తి ప్రాణ నష్టాలకు దారి తీయకూడదని చెప్పింది. చర్చల ద్వారానే సమస్యకు పరిష్కారం దొరుకుతుందని అభిప్రాయపడింది. అన్ని రైతు సంఘాల వాదనల తర్వాత కమిటీ ఏర్పాటుపై నిర్ణయాన్ని వెలువరించనున్నట్లు తెలిపింది. ఇరుపక్షాల వాదనలు వినేందుకు నిస్పాక్షిక, స్వతంత్ర కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పింది. అయితే రైతుల ఆందోళనతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని సీనియర్‌ న్యాయవాది హరీశ్‌ సాల్వే కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. చట్టాలను రద్దు చేయాలని పట్టుదలతో రైతులు ఉన్నారని ఏజీ కేకే వేణుగోపాల్‌ తెలిపారు. ఆరు నెలల పాటు నిరసన తెలిపేందుకు రైతులు సిద్ధమై వచ్చారని చెప్పారు.


ఈ సందర్భంగా కోర్టు కల్పించుకొని ఢిల్లీకి వచ్చే రోడ్లను మూసివేశారా? అని ప్రశ్నించింది. సింఘు, టిక్రీ సరిహద్దులను మూసివేశారని ఏజీ పేర్కొన్నారు. జాతీయ కిసాన్‌ యూనియన్‌ తరఫున న్యాయవాది ఏపీ సింగ్‌ వాదనలు వినిపించారు. భారత్‌ రైతు ఆధారిత దేశమని, బహుళజాతి సంస్థల ఆధారిత దేశం కాదన్నారు. లాక్‌డౌన్‌ సమయంలో ప్రజల ఆకల్చి తీర్చిదింది రైతులేనన్నారు. రోడ్లను దిగ్బంధిస్తే ఢిల్లీ ఆకలితో అలమటించాల్సి వస్తుందని పిటిషనర్‌ ఆరోపించగా.. నిరసనను తెలియజేసే హక్కు రైతులకు ఉందని సుప్రీం కోర్టు పేర్కొంది. ఏళ్ల తరబడి నిరసన చేస్తామనడం సరికాదని, అయితే నిరసనల పేరిట మొత్తం నగరాన్ని అడ్డుకోలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. దేశంలో రైతుల పరిస్థితి తమకు తెలుసునని కోర్టు పేర్కొంది. రైతుల సమస్యల పట్ల సానుభూతి సైతం ఉన్నదన్నది. ప్రస్తుతానికి సాగు చట్టాలు అమలు చేయమని హామీ ఇవ్వగలరా? అని సుప్రీం కోర్టు ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన అటార్నీ జనరల్‌ను ప్రశ్నించింది. దీనికి స్పందించిన ఆయన హామీ ఇవ్వలేమని చెప్పారు. రైతు ప్రతినిధుల పూర్తి వాదనల తర్వాత తుది ఉత్తర్వులిస్తామని, వాదనలు వినేందుకు అన్ని సంఘాలకు నోటీసులు జారీ చేయనున్నట్లు తెలిపింది. కేసు విచారణను శీతాకాల వెకేషన్‌ బెంచ్‌కు బదిలీ చేయనునట్లు సీజేఐ పేర్కొన్నారు.


logo