న్యూఢిల్లీ, నవంబర్ 16: కేంద్ర ప్రభుత్వానికి రైతు సంఘాలు మరోసారి హెచ్చరికలు జారీ చేశాయి. కనీస మద్దతు ధరకు చట్టబద్ధతతో పాటు పలు డిమాండ్లను నెరవేర్చకపోతే తమ పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామని, ఈ నెల 26 నుంచి ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని సంయుక్త కిసాన్ మోర్చా (రాజకీయేతర), కిసాన్ మజ్దూర్ మోర్చా శనివారం హెచ్చరించాయి.
ఈ సందర్భంగా ఎస్కేఎం నేత జగ్జిత్ సింగ్ దల్లేవాల్ మీడియాతో మాట్లాడుతూ తమ డిమాండ్లను నెరవేర్చడానికి కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, ఫిబ్రవరి 18 నుంచి తమతో ఎలాంటి చర్చలు కూడా జరపలేదని ఆరోపించారు. కేంద్రం తమ డిమాండ్లు తీర్చకపోతే నవంబర్ 26 నుంచి ఖనౌరి బోర్డర్ పాయింట్లో ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభిస్తామని చెప్పారు.