న్యూఢిల్లీ: గడచిన వారం రోజులుగా ఢిల్లీలో (Delhi) విమాన జీపీఎస్ (GPS) సిగ్నల్స్‌లో నకిలీ అలర్ట్స్ తరచూ కనిపిస్తున్నాయి. దీన్ని జీపీఎస్ స్పూఫింగ్ (GPS Spoofing) అని కూడా అంటారు. దీని కింద విమాన పైలట్లు తప్పుడు నేవిగేషన్ (దారిచూపే వ్యవస్థ) అందుకోవడం, ల్యాండింగ్ సమయంలో గందరగోళపరిచే హెచ్చరికలు రావడం జరుగుతోంది. ఇటువంటి సంఘటనలు ఢిల్లీకి 100 కిలోమీటర్ల వ్యాసార్థం లోపలే జరుగుతున్నట్లు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వర్గాలు వెల్లడించాయి.
ఈ స్పూఫింగ్ పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్(డీజీసీఏ)కి తెలియచేసినట్లు వారు చెప్పారు. స్పూఫింగ్ అనేది ఓ రకంగా సైబర్ దాడి లాంటిదే. నేవిగేషన్ సిస్టమ్స్‌ని తప్పుదారి పట్టించేందుకు బూటకపు జీపీఎస్ సిగ్నల్స్‌ని ఇది పంపుతుంది. సాధారణంగా వీటిని శత్రు సేనలకు చెందిన డ్రోన్లు, విమానాలను ధ్వంసం చేయడానికి యుద్ధ రంగంలో ఉపయోగిస్తుంటారు.
గత వారం తాను ఆరు రోజులు పనిచేసినప్పుడు అనేకసార్లు తనకు జీపీఎస్ స్పూఫింగ్ ఎదురైందని ఓ పైలట్ వెల్లడించారు. ఓసారి ఢిల్లీ విమానాశ్రయంలో విమానాన్ని ల్యాండింగ్ చేస్తున్న సమయంలో కాక్‌పిట్ సిస్టమ్‌పైన ఓ అలర్ట్ కనిపించిందని, ముందున్న దారిలో ముప్పు ఉన్నట్లు ఆ అలర్ట్ పేర్కొందని, అయితే అటువంటిదేదీ అక్కడ జరగలేదని ఆయన వివరించారు. ఇవే అలర్ట్స్ అనేక ఇతర విమానాలకూ వచ్చాయని, ఈ కారణంగా అనేక విమానాలకు ఆలస్యమైందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఢిల్లీ విమానాశ్రయంలో జీపీఎస్ స్పూఫింగ్ అసాధారణమని పేర్కొన్నాయి.