న్యూఢిల్లీ : ప్రపంచ మహమ్మారి కరోనాను ఎదుర్కొనేందుకు మార్కెట్లోకి మరో కొత్త వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. ముంబైకి చెందిన గ్లెన్‌మార్క్ కంపెనీ నైట్రిక్ ఆక్సైజ్ నాసల్ స్ప్రేను అభివృద్ధి చేసింది.. కెనడాకు చెందిన సానోటైజ్ (SaNOtize) కంపెనీ భాగస్వామ్యంతో ‘ఫ్యాబిస్ప్రే’ (FabiSpray) పేరుతో పెద్ద వయసు వారి కోసం నాసల్ వ్యాక్సిన్‌ను తయారు చేయగా.. భారత డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఉత్పత్తి, మార్కెటింగ్ చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది.
కంపెనీ భారత్‌లో ఫేజ్-3 ట్రయల్స్ నిర్వహించింది. ఇందులో 24 గంటల్లో 94శాతం, 48 గంటల్లో 99శాతం వైరల్ లోడ్‌ను తగ్గించిందని కంపెనీ పేర్కొంది. నైట్రిక్ ఆక్సైడ్ నాసల్ స్ప్రే (NONS) సురక్షితమైందని, కొవిడ్‌ను మెరుగ్గా ఎదుర్కోగలదని పేర్కొంది. ఫ్యాబీ స్ప్రే శ్వాస నాళాల్లోనే కొవిడ్ వైరస్‌ను నిర్మూలించేందుకు రూపొందించినట్లు చెప్పింది. ముక్కు ద్వారా వ్యాక్సిన్‌ను స్ప్రే చేసిన సమయంలో వైరస్‌ను ఊపిరితిత్తుల వరకు చేరకుండా నిరోధిస్తుందని కంపెనీ పేర్కొంది.
కొవిడ్-19పై స్ప్రే సమర్థవంతమైందని, సురక్షితమైందని గ్లెన్‌మార్క్ ఫార్మా స్యూటికల్స్ లిమిటెడ్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ రాబర్ట్ క్రోకార్ట్ పేర్కొన్నారు. కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా భారత్ చేస్తున్న పోరాటంలో కంపెనీ అంతర్భాగంగా ఉండడం చాలా ముఖ్యమన్నారు. నైట్రిక్ ఆక్సైడ్ నాసల్ స్ప్రే (FabiSpray) అనుమతి పొందడం, సానోటైజ్ కంపెనీ భాగస్వామ్యంతో టీకా రూపొందించడం సంతోషంగా ఉందన్నారు.
ఇదిలా ఉండగా.. నాసల్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ అమెరికాలోని ఉటా (Utah) స్టేట్ యూనివర్సిటీలో నిర్వహించిన ట్రయల్స్‌లో ఆల్ఫా, బీటా, గామా, డెల్టా సహా పలు సార్స్-కోవ్-2 వైరస్‌లను రెండు నిమిషాల్లోనే 99.9శాతం వైరస్‌ను నిర్మూలిస్తున్నట్లు కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ మోనికా టాండన్ పేర్కొన్నారు.